kumaram bheem asifabad- అభ్యర్థులు నచ్చలే..
ABN , Publish Date - Dec 24 , 2025 | 09:46 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాకు (నన్ ఆఫ్ ది ఎబోవ్ ) వేల సంఖ్యలో ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సర్పంచ్‌లుగా ఇష్టం లేదంటూ 2,091 మంది నోటాకే ఓటు వేశారు. ఓటు వేసే విధానం పైన అవగహన కొరవడి సర్పంచ్‌లకు సంబంధించి 10,016 ఓట్లు చెల్లకుండా పోయాయి.
- సర్పంచ్ ఎన్నికల్లో తొలిసారి నోటా
- ఓటర్లకు అవగహన లేక చెల్లకుండా పోయినవి 10,016 ఓట్లు
ఆసిఫాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాకు (నన్ ఆఫ్ ది ఎబోవ్ ) వేల సంఖ్యలో ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సర్పంచ్‌లుగా ఇష్టం లేదంటూ 2,091 మంది నోటాకే ఓటు వేశారు. ఓటు వేసే విధానం పైన అవగహన కొరవడి సర్పంచ్‌లకు సంబంధించి 10,016 ఓట్లు చెల్లకుండా పోయాయి. కాగా లింగాపూర్ మండలంలో తక్కువగా 51 మంది , కెరమెరి మండలంలో అత్యధికంగా 276 మంది నోటాకు ఓటు వేశారు.
అసెంబ్లీ, పార్లమెంట్..
ఎన్నికల కమిషన్ మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహించి అందులో నోటాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం నోటాను ప్రవేశపె ట్టింది. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ఆ ఓటరు ఎవరు నచ్చలేదంటూ తమ అభిప్రాయం తెలియజేసేలా నోటా గుర్తును సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ పై ముద్రించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 2,091 మంది ఓటర్లు సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి బ్యాలెట్ పై నోటాకు ఓటు వేసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
- మూడు విడతల్లో ఎన్నికలు:
జిల్లాలో 15 మండలాల పరిధిలో మూడు విడతల్లో ఈనెల 11,14,17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 335 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో వాంకిడి మండలంలోని తేజగూడ, ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి, చిలాటిగూడ గ్రామాలలో సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు అనుకులించకపోవడంతో అక్కడ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగలేదు. మిగితా 332 గ్రామపంచాయతీల్లో అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఆ గ్రామ పంచాయతీల పరిధిలో 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. కాగా 2,91,216 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 2,091 మంది ఓటర్లు నోటాకు ఓటు వేసి తమకు అభ్యర్థులు నచ్చలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
- వేల సంఖ్యలో..
జిల్లాలో వేల మందికి ఓట్లు వేయడం కూడా రాలేదు. ఇన్నాళ్ళూ ఈవీఎంలకు అలవాటు పడిన ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థి గుర్తు ఉన్న బాక్సులో స్వస్తిక్ ముద్ర వేయాల్సి ఉండగా.. అది కూడా సరిగ్గా వేయకపోవడంతో ఓట్లు చెల్లకుండా పోయాయి. అలా జిల్లా వ్యాప్తంగా 10,016 ఓట్లు చెల్లలెదు. ఓటు వే సే విధానం పై ప్రజలకు అవగహన లేకపోవడంతోనే ఓట్లు చెల్లకుండా పోయాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారులు అవగాహన సమావేశాలు నిర్వహించే భవిష్యత్తులో మంచిదని తెలియజేస్తున్నారు.
మండలాల వారీగా వివరాలు ఇలా..
మండలం చెల్లనిఓట్లు నోటాకు
జైనూర్ 436 199
కెరమెరి 611 276
లింగాపూర్ 187 51
సిర్పూర్-యు 344 57
వాంకిడి 1,042 141
బెజ్జూర్ 810 105
చింతలమానేపల్లి 821 115
దహెగాం 631 202
కౌటాల 789 140
పెంచికల్‌పేట 329 52
సిర్పూర్-టి 645 74
ఆసిఫాబాద్ 983 177
కాగజ్‌నగర్ 1,164 235
రెబ్బెన 649 150
తిర్యాణి 575 117
--------------------------------------------------------------------
మొత్తం 10,016 2,091
--------------------------------------------------------------------