Telangana Minister Sridhar Babu: క్షేత్రస్థాయి సర్వే తర్వాతే అభ్యర్థుల ఎంపిక
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:47 AM
ప్రతి నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి సర్వే నిర్వహించిన తర్వాతే స్థానిక సంస్థల అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు....
స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రతి నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి సర్వే నిర్వహించిన తర్వాతే స్థానిక సంస్థల అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జిలతో ఆయన సమావేశమై సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలు, ఇంచార్జిల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో మంత్రి దామోదర భేటీ
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకే స్థానిక సంస్థల టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆయన శనివారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.