Cancer Care Centers: త్వరలో జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ కేర్ సెంటర్లు
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:12 AM
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ కేర్ సెంటర్లు, జాతీయ రహదారుల వెంట ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు..
జాతీయ రహదారుల వెంట ‘ట్రామాకేర్’లు
వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా
మహబూబాబాద్‌లో వైద్య కళాశాల హాస్టళ్లను ప్రారంభించిన రాజనర్సింహ, పొంగులేటి, సురేఖ
మహబూబాబాద్, జనగామ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ కేర్ సెంటర్లు, జాతీయ రహదారుల వెంట ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ప్రతి జిల్లా ఆస్పత్రిలో సీటీస్కాన్, ఎంఆర్‌ఐ అవసరమని వాటి ఏర్పాటుకు కూడా కృషి చేస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రూ. 186 కోట్లతో నిర్మించిన వైద్యకళాశాల బాలుర, బాలికల హాస్టళ్లను, 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ భవనాలను మంత్రులు దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, కొండా సురేఖ మంగళవారం ప్రారంభించారు. అలాగే, జనగామ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ మిషన్‌ను రాజనర్సింహా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మంత్రి రాజనర్సింహా మాట్లాడుతూ... వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు, వారి సమస్యల పరిష్కారానికిప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.
ఏపీకి బదిలీ అయిన శివశంకర్ లోతేటి
వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి శివశంకర్ లోతేటిని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు బదిలీ చేసింది. కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శివశంకర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ చేయాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే.
6000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం మరో 6000 కోట్ల అప్పు తీసుకుంది. ఆర్బీఐ నిర్వహించిన ఈ-వేలం ద్వారా రుణాన్ని సేకరించింది. 26 ఏళ్ల కాల పరిమితి, 7.74 శాతం వార్షిక వడ్డీతో రూ.1500 కోట్లు, 30 ఏళ్ల కాల పరిమితి, 7.74 శాతం వార్షిక వడ్డీతో రూ. 1500 కోట్లు, 32 ఏళ్ల కాల పరిమితి, 7.72 శాతం వార్షిక వడ్డీతో రూ.1500 కోట్లు, 38 ఏళ్ల కాల పరిమితి, 7.72 శాతం వార్షిక వడ్డీతో రూ.1500 కోట్ల చొప్పున ఈ రుణాన్ని సేకరించింది.
77 మంది ఏఈఈలకు పదోన్నతి
నీటిపారుదల శాఖలో 77 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఏఈఈ)లకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈ)లుగా పదోన్నతి కల్పించి, పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరికి పోస్టింగ్ ఇస్తూ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.