Share News

kumaram bheem asifabad- కాలువలు అధ్వానం..సాగు ప్రశ్నార్థకం

ABN , Publish Date - Nov 12 , 2025 | 10:50 PM

వానాకాలంలో వరుసగా కురిసిన వర్షాలతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. పంట దిగుబడి రాక దయనీయ పరిస్థితి నెలకొంది. యాసంగి పంటైనా సాగు చేసి అప్పులు తీర్చుకునేందుకు సిద్ధమయ్యా రు. కానీ జలాశయాల పరిస్థితి అధ్వానంగా తయా రైంది. పూడిక చేరడం, పిచ్చి మొక్కలు, ఆయా చోట్ల కాలువలు మూసిపోవడంతో అయో మయం నెలకొంది.

kumaram bheem asifabad- కాలువలు అధ్వానం..సాగు ప్రశ్నార్థకం
శిథిలావస్థకు చేరిన మత్తడి తూము

- ఇసుకతో నిండిన ఆనకట్ట

- ప్రభుత్వం స్పందిస్తేనే రైతులకు మేలు

బెజ్జూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో వరుసగా కురిసిన వర్షాలతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. పంట దిగుబడి రాక దయనీయ పరిస్థితి నెలకొంది. యాసంగి పంటైనా సాగు చేసి అప్పులు తీర్చుకునేందుకు సిద్ధమయ్యా రు. కానీ జలాశయాల పరిస్థితి అధ్వానంగా తయా రైంది. పూడిక చేరడం, పిచ్చి మొక్కలు, ఆయా చోట్ల కాలువలు మూసిపోవడంతో అయో మయం నెలకొంది. ఇరిగేషన్‌ అధికారులు ఆయా పనులకు ప్రతిపాదనలు పంపినా మంజూరు కాకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెక్కలు ముక్కలు చేసి పంటలు పండించే రైతన్నలు ఉన్నా వారికి సాగునీరు లేక వర్షాదార పంటలను వేస్తూ కాలం కలిసి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. మూడు కాలాల పాటు సాగు నీరు అందితే ఇక్కడి పొలాలు పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. బెజ్జూరు మండలంలోని మత్తడి స్ర్పింగ్‌ ఆనకట్ట జలాశయం ఉన్నా సాగు నీరందించే పరిస్థితి లేదు. కాలువలు మొత్తం ద్వంసమయ్యాయి. కాలువల్లో ఇసుక, పూడిక నిండి నీరవ్వలేని పరిస్థితి నెలకొంది.

- 1903లో నిర్మాణం..

బెజ్జూరు మండల కేంద్రంలోని ఐదు కిలోమీటర్ల దూరంలోని పచ్చని అటవీ ప్రాంతంలో ఉబికి వస్తున్న జలాలను చూసి వృథాగా పోతున్న జలవనరులను ఒడిసి పట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో అప్పటి నిజాం రాజు 1903లో మత్తడి అటవీ ప్రాంతంలో ఆనకట్ట నిర్మించాడు. ఈ ప్రాంతానికి వేటకు వచ్చిన నిజాం రాజు అటవీ ప్రాంతంలో ఊట్ల ప్రాంతం నుంచి ఉబికి వస్తున్న జలాలను ఒడిసి పట్టి సాగునీటికి నీరు అందించి రైతుల పంటలు సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో మత్తడి స్ర్పింగ్‌ ఆనకట్టకు పునాది వేశాడు. దీని కింద సుమారు 800ఎకరాలకు పైగా పంట పొలాలకు సాగు నీరు అందేది. ఆయకట్టు కింద బెజ్జూరు, ఎల్కపల్లి, చిన్నసిద్దాపూర్‌ గ్రామాల రైతులు పంటలు సాగు చేస్తారు. క్రమంగా దీని ఆయకట్టు విస్తీర్ణం పూర్తిగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు కేవలం 200ఎకరాలకు పైగా మాత్రమే సాగు నీరందుతోంది. పాలకులు దీని మరమ్మత్తులపై పట్టించుకోకపోవడంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో వృదాగా పోతున్న జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న తపనతో ఏర్పాటు చేసిన జలాశయంపై ప్రస్తుత పాలకులు దీన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

- మరమ్మతులు కరువు..

మత్తడి స్ర్పింగ్‌ ఆనకట్టకు మరమ్మత్తులు చేయని కారణంగా నిజాం ఆశయం నెరవేరడం లేదు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర హయాంలో దీని మరమ్మతులు చేపట్టారు. కాలువలు నిర్మించి, మత్తడి కొత్తగా నిర్మించినా ఇప్పుడు ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం నీటి కాలువలు పూర్తిగా ఇసుకతో నిండి పూడిక పెరిగింది. దీంతో కాలువల నుంచి సాగునీరు అందడం లేదు. మత్తడి కూడా శిథిలావస్థకు చేరడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. మత్తడికి లోపల నీరు ఆగేచోట కూడా పూర్తిగా ఇసుక నిండిపోయింది. దీంతో నీరంతా కాలవల ద్వారా వెళ్లకుండా పొలాలకు చేరడం లేదు. మత్తడి వద్ద ఏర్పాటు చేసిన తలుపులు కూడా శిథిలమయ్యాయి. దీని ఆయకట్టు కింద కొన్ని దశాబ్దాలుగా రైతులు రెండు పంటలను సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు కేవలం ఒక పంటకు కూడా పూర్తిస్థాయిలో సాగు నీరందక దైన్యంగా మారింది. ఆయకట్టు రైతులు వర్షాలు కురవని సమయంలో ఆయిల్‌ ఇంజన్ల ద్వారా కాలువల నుంచి సాగునీటిని పొలాలకు మల్లిస్తున్నారు. అయినా పూర్తిస్థాయిలో రైతుల పంటలకు అందడం లేదు. పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టినట్లయితే రైతులకు రెండు పంటలకు పుష్కలంగా సాగు నీరందే అవకాశం ఉంది.

- ఇసుక మేటలు తొలగిస్తే..

మత్తడి స్ర్పింగ్‌ ఆనకట్ట కాలువల్లో నిండిన ఇసుకను తొలగిస్తే రైతులకు మేలు కలిగే అవకాశం ఉంది. మత్తడి లోపల నీరు నిల్వ ఉండే చోట పూర్తిగా ఇసుక నిండడంతో సాగు నీరు నిల్వ లేకుండా పోతోంది. కాలువల్లో, మత్తడి లోపల నుంచి ఇసుకను తొలగిస్తే ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరందే అవకాశం ఉంటుందని రైతులు బావిస్తున్నారు. మత్తడి లోపలి బాగంలో నిండిన ఇసుకను తొలగిస్తే వానాకాలం, యాసంగి పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు అంది రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన స్ర్పింగ్‌ ఆనకట్టను పాల కులు పట్టింపులేనితనంగా వ్యవహరిస్తుండడంతో సాగు నీరందడం లేదు. పాలకులు మరమ్మతుపై దృష్టి సారిస్తే రైతులకు మేలు జరుగనుంది.

ప్రతిపాదనలు పంపించాం..

- అజయ్‌, ఇరిగేషన్‌ డీఈ, కాగజ్‌నగర్‌

బెజ్జూరు మత్తడి స్ర్పింగ్‌ ఆనకట్ట మరమ్మత్తుల కోసం గతంలోనే ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించాం. ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందని విషయం మా దృష్టికి వచ్చింది. ని ధులు మంజూరు కాగానే మరమ్మతులు చేయిస్తాం.

Updated Date - Nov 12 , 2025 | 10:50 PM