TS High Court: ఊహల ఆధారంగా పిటిషన్లు వేస్తారా?
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:11 AM
ఊహలు, అంచనాల ఆధారంగా పిటిషన్లు దాఖలు చేయడం ఏంటి పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ఏదో ఊహించుకుని పిటిషన్లు వేయడం ఏంటి...
పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి కోర్టును ఆశ్రయిస్తారా ?: హైకోర్టు
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వద్దంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఊహలు, అంచనాల ఆధారంగా పిటిషన్లు దాఖలు చేయడం ఏంటి ? పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ఏదో ఊహించుకుని పిటిషన్లు వేయడం ఏంటి ?.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ప్రభుత్వం జీవో ఇవ్వబోతుందని ఊహించుకుని పిటిషన్ వేయడం అసమంజసం అని పేర్కొంటూ సదరు పిటిషన్‌ను కొట్టేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడానికి ప్రయత్నిస్తుందోని, అది రాజ్యాంగ విరుద్ధమంటూ బుట్టెంగారి మాధవరెడ్డి అనే సామాజిక కార్యకర్త, జలపల్లి మల్లవ్వ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదిస్తూ.. తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ - 2018 లోని సెక్షన్ 285ఏ ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా గరిష్ఠ పరిమితి విధించారని.. సదరు నిబంధన అమలులో ఉందని.. దానిని కదిలించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం ఏంచేస్తుందో తెలియకుండా ఎలా పిటిషన్ దాఖలు చేస్తారని ప్రశ్నించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చేపట్టలేమని జార్జ్ ఫెర్నాండేజ్ ’ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని పేర్కొంది. ఈ మేరకు ఇది ప్రీమెచ్యూర్ పిటిషన్ అని కొట్టేసింది. అయితే ప్రభుత్వం జీవో జారీ చేస్తే మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది.