Share News

CM Revanth Reddy condemned : ఐపీఎస్‌‌కే ఇలా జరిగితే.. సామాన్యుల పరిస్థితేంటి?

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:37 AM

హరియాణాలో సీనియర్‌ ఐపీఎస్‌ పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకోవడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పూరన్‌ కుటుంబ సభ్యులకు...

CM Revanth Reddy condemned : ఐపీఎస్‌‌కే ఇలా జరిగితే.. సామాన్యుల పరిస్థితేంటి?

  • ఐపీఎస్‌ పూరన్‌ ఆత్మహత్యపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి..

  • దళితులు, బలహీనవర్గాలపై అన్యాయాలను సహించొద్దని వ్యాఖ్య

  • పూరన్‌ ఆత్మహత్యకు కారకులను కఠినంగా శిక్షించాలి: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): హరియాణాలో సీనియర్‌ ఐపీఎస్‌ పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకోవడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పూరన్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఒక ఏడీజీపీ స్థాయి అధికారి కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నారంటే.. సాధారణ ప్రజలు ఎలాంటి బాధలు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూరన్‌కు జరిగినది ఒక వ్యక్తిపై దాడి కాదని.. దేశం మొత్తంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇటువంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ‘ఎక్స్‌’ వేదికగా పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల పట్ల ద్వేషం.. సమాజాన్ని విషపూరితం చేస్తుందన్నారు. ఇలాంటి ఘటనల వల్ల రాజ్యాంగం, సమానత్వం, న్యాయంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. దళితులు, బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించరాదని వ్యాఖ్యానించారు. ఉన్నతాధికారుల కుల వివక్ష, మానసిక వేధింపులను భరించలేక ఐపీఎస్‌ పూరన్‌ ఆత్మహత్యకు పాల్పడటం విచారకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హరియాణా డీజీపీ శత్రుజీత్‌ కపూర్‌ సహా 8 మంది సీనియర్‌ అధికారుల కారణంగానే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పూరన్‌ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారని తెలిపారు. ఆ సూసైడ్‌ నోట్‌ ఆధారంగా బాధ్యులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా అత్యున్నత అఖిల భారత సర్వీసుల్లో ఇంకా కుల వివక్ష, ఆత్మహత్య వంటి సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలపై కుల వివక్ష, అణిచివేతలు, అక్రమ నిర్బంధం, ఆత్మహత్యలు వంటి సంఘటనలను బీజేపీ సర్కారు ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.


భట్టిని కలిసిన నవీన్‌ యాదవ్‌..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌.. డిప్యూటీ సీఎం భట్టిని కలిశారు. ఈ సందర్భంగా నవీన్‌ యాదవ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అభివృద్ధే లక్ష్యం గా ప్రభుత్వం పని చేస్తోందని.. ఉప ఎన్నికలో గెలిచి కాంగ్రెస్‌ జెండాను ఎగరవేయాలని సూచించారు.

Updated Date - Oct 12 , 2025 | 03:37 AM