Share News

Cabinet Sub Committee: ‘స్థానికత’ ఆధారంగా ఉద్యోగులకు డిప్యూటేషన్లు!

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:13 AM

ఉద్యోగులకు సర్దుబాటు జీవో 317పై ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమై పలు అంశాలకు సంబంధించి చర్చించింది.

Cabinet Sub Committee: ‘స్థానికత’ ఆధారంగా ఉద్యోగులకు డిప్యూటేషన్లు!

  • రెండు మూడేళ్ల పాటు పంపాలన్న ప్రతిపాదన

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు సర్దుబాటు జీవో 317పై ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమై పలు అంశాలకు సంబంధించి చర్చించింది. బుధవారం సచివాలయంలో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 317 జీఓకు సంబంధించిన ఉద్యోగ సమస్యలపై కమిటీ చర్చించింది. ఈ జీవోకు సంబంధించి ఇప్పటికే పరస్పర బదిలీలు, మెడికల్‌ గ్రౌండ్‌ బదిలీలు, భార్యాభర్తల(స్పౌజ్‌) కేసుల బదిలీలు పూర్తయ్యాయి. అయితే.. ఉద్యోగుల స్థానికతను ఆధారంగా చేసుకుని బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


ఈ అంశంపై కమిటీ అధికారుల నుంచి వివరాలు కోరింది. ఎలా చేస్తే బాగుంటుందన్న అంశంపై చర్చించింది. స్థానికత ఆధారంగా జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగులను రెండు మూడేళ్ల పాటు డిప్యూటేషన్‌పై పంపితే ఎలా ఉంటుందన్న చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనను ఆలోచించాలని అధికారులను కమిటీ ఆదేశించింది. క్లియర్‌ వెకెన్సీలు ఉన్న చోటనే స్థానికత ఆధారంగా ఉద్యోగులకు డిప్యూటేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈమేరకు అధికారులు కార్యాచరణను చేపట్టాలని, వచ్చే సమావేశం నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది.

Updated Date - Aug 21 , 2025 | 04:13 AM