Share News

Cabinet Meeting Tomorrow: రేపు క్యాబినెట్‌ సమావేశం

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:42 AM

రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. సచివాలయం ఆరో అంతస్తులోని క్యాబినెట్‌ సమావేశ మందిరంలో..

Cabinet Meeting Tomorrow: రేపు క్యాబినెట్‌ సమావేశం

  • బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై చర్చ

  • సాగునీటి ప్రాజెక్టులు, మూసీ, మెట్రోపైనా..

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గం గురువారం (ఈ నెల 16న) సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. సచివాలయం ఆరో అంతస్తులోని క్యాబినెట్‌ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ధాన్యం సేకరణ, మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 అమలుపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం ఏర్పడింది. హైకోర్టు స్టేను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ గురువారమే విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదే రోజు మంత్రివర్గ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్‌అండ్‌టీ సంస్థ వైదొలగడంతో ప్రభుత్వమే నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. దీంతోపాటు మూసీ ప్రాజెక్టు, గిగ్‌ వర్కర్ల సంక్షేమ చట్టం, టీ-ఫైబర్‌ విస్తరణ, ఫ్యూచర్‌ సిటీ అంశాలు క్యాబినెట్‌ భేటీలో చర్చకు రానున్నాయి. వివిధ సాగునీటి పారుదల ప్రాజెక్టుల అంచనాలను పెంచే అంశంపైనా చర్చించవచ్చని సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం, సమ్మక్క-సారలమ్మ ఆనకట్ట, దేవాదుల ఆరో ప్యాకేజీ వంటి విషయాలు చర్చకు రానున్నట్లు తెలిసింది.

Updated Date - Oct 15 , 2025 | 04:42 AM