Share News

iBomma Operator Arrested: పైరసీ చేయడు.. సినిమాలు కొంటాడు

ABN , Publish Date - Nov 26 , 2025 | 05:05 AM

సినిమా పైరసీ, కాపీరైట్‌ ఉల్లంఘన, బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌, మనీలాండరింగ్‌ కేసుల్లో అరెస్టయిన ఐ బొమ్మ రవి నుంచి విచారణ సందర్భంగా విస్తుపోయే విషయాలు తెలిశాయని హైదరాబాద్‌ క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ అడిషనల్‌ సీపీ శ్రీనివాస్‌ తెలిపారు.....

iBomma Operator Arrested: పైరసీ చేయడు.. సినిమాలు కొంటాడు

  • మువీరూల్జ్‌, తమిళ్‌ ఎంవీ వంటి సైట్ల నుంచి కొనుగోలు.. క్రిప్టోలో చెల్లింపులు.. ఆ సినిమాలకు హెచ్‌డీ హంగులు

  • సైట్లో యాడ్స్‌తోనే డబ్బు

  • మాజీ భార్యకేమీ తెలియదు.. రవిని అతి విశ్వాసమే పట్టించింది

  • క్రైమ్స్‌ అడిషనల్‌ సీపీ శ్రీనివాస్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): సినిమా పైరసీ, కాపీరైట్‌ ఉల్లంఘన, బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌, మనీలాండరింగ్‌ కేసుల్లో అరెస్టయిన ఐ బొమ్మ రవి నుంచి విచారణ సందర్భంగా విస్తుపోయే విషయాలు తెలిశాయని హైదరాబాద్‌ క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ అడిషనల్‌ సీపీ శ్రీనివాస్‌ తెలిపారు. ఐ బొమ్మ ప్రారంభం నుంచి రవి ఖాతాలో డబ్బులు జమ అయ్యేంత వరకు జరిగే ప్రాసె్‌సను మంగళవారం ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. రవి తన వివరాలు, ఈ మెయిల్‌ ఐడీతో ఎన్‌జిలా కంపెనీ ద్వారా డొమైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. ఐపీ వాల్యూమ్‌ హోస్టింగ్‌ తీసుకున్నాడు. తర్వాత కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా పైరసీ సినిమాలు కొంటాడు. వాటిని హెచ్‌డీ క్వాలిటీ వచ్చేలా ఎన్‌హ్యాన్స్‌ చేస్తున్నాడు. బొమ్మ పోస్టర్‌ను రవి స్నేహితుడు నిఖిల్‌ డిజైన్‌ చేస్తాడు. బొమ్మ సైట్లో పోస్టర్‌ పడగానే దాన్ని చూడాలనుకుంటున్నవారు, డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకునేవారు ‘టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌’ను అంగీకరించాల్సి ఉంటుంది. అంగీకరించగానే వినియోగదారునికి తొలుత బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌ లింకులు ఓపెన్‌ అవుతాయి. యాడ్స్‌ అయిపోయేదాకా వినియోగదారులు చూడాల్సిందే. అలా ఎన్ని లక్షల మంది చూస్తే అంత ఎక్కువ మొత్తంలో రవికి డబ్బులొస్తాయి. విలాసవంతంగా గడిపేందుకు రవి.. తాను ఆర్జించిన రూ.20 కోట్లలో రూ.17 కోట్లు వెచ్చించి విదేశాల్లో తిరిగారని అడిషనల్‌ సీపీ తెలిపారు. ఆయన ఖాతాలోని మిగిలిన రూ.3 కోట్లను ఫ్రీజ్‌ చేశామని.. హైదరాబాద్‌లో ఓ ప్లాట్‌ను, వైజాగ్‌లోని ఆస్తులను సీజ్‌ చేశామని వెల్లడించారు. ఇమ్మడి రవి సినిమాను నేరుగా పైరసీ చేయడు. టెలిగ్రామ్‌లో, మువీరూల్జ్‌, తమిళ్‌ ఎంవీ వంటి పైరసీ సైట్ల నుంచి కొంటాడు. ప్రతిగా వారికి క్రిప్టో కరెన్సీ రూపంలో ఆన్‌లైన్‌లో చెల్లిస్తాడు. ఆ పైరసీ సినిమాకు హెచ్‌డీ హంగులు అద్దుతుండటంతో ఐబొమ్మ, బప్పం విపరీతంగా ప్రజాదరణ పొందాయి. ఈ సైట్లను అడ్డంపెట్టుకొని లక్షల మంది డేటాను తన వద్ద స్టోర్‌ చేసుకోవడంతో పాటు.. బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయడం ద్వారా రవి రూ. కోట్లు సంపాదించినట్లు గుర్తించారు. త్వరలో వెబ్‌-3 టెక్నాలజీ రానుందని, ఆ టెక్నాలజీతో పైరసీ చేస్తే పట్టుకోవడం కష్టమని అడిషనల్‌ సీపీ వెల్లడించారు.


మాజీ భార్య సమాచారం ఇవ్వలేదు

ఐ బొమ్మలో సినిమా పైరసీ జరుగుతుందని ఇండస్ట్రీ నుంచి ఫిర్యాదు వచ్చాక సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాల ద్వారా విచారణ చేస్తున్న క్రమంలో.. వారికి డొమైన్‌ రిజిస్ట్రేషన్‌ వివరాలు లభ్యమయ్యాయి. అందులో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ ఆధారంగా వాటికి సంబంధించి విదేశాల్లో ఉన్న డొమైన్‌ కంపెనీ నోడల్‌ ఆఫీసర్‌ను ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించారు. అయితే పోలీసులు చేసిన మెయిల్‌ నేరుగా రవికి చేరింది. ఈ డొమైన్‌ ఎవరు వినియోగిస్తున్నారు? సినిమా పైరసీ చేసి ఐబొమ్మలో ఎవరు అప్‌లోడ్‌ చేస్తున్నారు? వివరాలు కావాలని పోలీసులు అడిగారు. తనకోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న రవి.. ‘‘సినిమాలు పైరసీ చేస్తున్నట్లు మీ వద్ద ఏం ఆధారాలునాయి?’’ అంటూ ఉల్టా వారినే ప్రశ్నించాడు. దాంతో అతని మెయిల్స్‌, వ్యవహారశైలిపై పోలీసులు అనుమానించారు. అక్కడితో అతడిని ప్రశ్నించడం ఆపేశారు. అతడి ఐపీ అడ్రస్‌, డొమైన్‌ రిజిస్ట్రేషన్‌లో ఇచ్చిన నంబర్ల ఆధారంగా రివర్స్‌ ఇంజనీరింగ్‌ విచారణ చేసి, సీడీఆర్‌ పెట్టి నిఘా పెట్టారు. కొద్దిరోజుల వరకు పోలీసుల నుంచి ఎలాంటి మెసేజ్‌ లేకపోవడంతో తనను పట్టుకోలేరనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో రవి ఉండిపోయాడు. అందులో భాగంగానే విదేశాలు తిరుగుతూ.. విజిటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఆ వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మూసాపేటలోని రెయిన్‌బో విస్తాలో పట్టుకున్నారు. రవిని అతడి ఓవర్‌ కాన్ఫిడెన్సే పట్టించిందని అడిషనల్‌ సీపీ వెల్లడించారు. అతడి మాజీ భార్య ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అమెకు ఈ విషయాలేవీ తెలియదని స్పష్టం చేశారు. కాగా రవి ఐదురోజుల కస్టడీ ముగిసింది. మరోవారం పాటు కస్టడీ ఇవ్వాల్సిందిగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక.. కస్టడీ ముగిసిపోవడంతో రవికి బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫున్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Updated Date - Nov 26 , 2025 | 05:05 AM