Share News

Builders Demand Immediate Payment: తక్షణమే బకాయిలు చెల్లించండి

ABN , Publish Date - Nov 07 , 2025 | 02:30 AM

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా...

Builders Demand Immediate Payment: తక్షణమే బకాయిలు చెల్లించండి

  • లేదంటే డిసెంబరు 1 నుంచి అన్ని పనులు ఆపేస్తాం

  • ప్రభుత్వానికి బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టీకరణ

  • అప్రాధాన్య పనులకు సంబంధించి రూ.18వేల కోట్లు పెండింగ్‌

  • ఆర్‌ అండ్‌ బీ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖలు

హైదరాబాద్‌, రాంనగర్‌ నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో డిసెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల పరిధిలో జరుగుతున్న పనులను నిలిపి వేస్తామని ప్రకటించింది. ఈ మేరకు బీఏఐ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్‌ రెడ్డి, రాష్ట్ర చైర్మన్‌ సురేందర్‌ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో చేసిన పనులతో పాటు ప్రస్తుతం కొనసాగిస్తున్న పనులకు సంబంఽధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తెచ్చి మరీ పనులను పూర్తి చేశారని, ఏళ్ల తరబడి బకాయిలు విడుదల కాకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, అప్రాధాన్య పనులను ముందస్తుగా ముగించి తుది బిల్లులు సిద్ధం చేయాలని కోరారు. ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాను ఖరారు చేసి, ఆయా పనులకు నిధులను సమయానికి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో చేపట్టిన అప్రాధాన్య పనుల్లో కొన్ని పూర్తి కాలేదని, ఇంకా కొన్ని కొనసాగుతున్నాయని, ఇలాంటి వాటికి సంబంధించి రూ.12 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ మరో రూ.6 వేల కోట్లు పెండింగ్‌లో పడిపోయాయన్నారు. ఆయా పనులను త్వరగా పూర్తి చేసి, కాంట్రాక్టర్లకు మొత్తం రూ.18 వేల కోట్లను చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవే అంశాలపై ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు బీఏఐ ప్రతినిధులతో ఈ నెలాఖరులోగా సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు అర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌, ఇరిగేషన్‌, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులకు గురువారం వినతి పత్రాలు అందజేశామని తెలిపారు.

Updated Date - Nov 07 , 2025 | 02:30 AM