Biomedical Science: బీఎస్సీ బయో మెడికల్ సైన్స్
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:33 AM
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది నుంచే డిగ్రీలో కొత్త కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఉపాధి కల్పనే లక్ష్యంగా కొత్త కోర్సులు ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ‘బీఎస్సీ బయో మెడికల్ సైన్స్’ కోర్సును తీసుకొచ్చింది.
ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సు
నాలుగేళ్ల ఆనర్స్, మూడేళ్ల డిగ్రీకీ అవకాశం 15 కాలేజీల్లో అందుబాటులోకి 900 సీట్లు
ఫార్మా సంస్థల్లో 100శాతం ఉద్యోగం వచ్చే కోర్సు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు మహమూద్
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది నుంచే డిగ్రీలో కొత్త కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఉపాధి కల్పనే లక్ష్యంగా కొత్త కోర్సులు ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ‘బీఎస్సీ బయో మెడికల్ సైన్స్’ కోర్సును తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 15 కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని ప్రవేశపెట్టింది. ప్రతి కాలేజీలో 60 చొప్పున మొత్తం 900 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం ఉన్నత విద్యామండలిలో నిర్వహించిన బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ సమీక్ష కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు మహమూద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ యూనివర్సిటీల బయోసైన్స్ ప్రొఫెసర్లు, హెచ్‌వోడీలు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త కోర్సు అమలుపై కమిటీ నిర్ణయం తీసుకుంది. బీఎస్సీ నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీకి మొత్తం 168 క్రెడిట్స్ ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని పూర్తిచేసిన వారు నెట్ పరీక్షతో పీజీ లేకుండా నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందవచ్చు. ఇదే కోర్సును మూడేళ్లలో పూర్తిచేసే అవకాశం కూడా ఉంది. దాన్నీ డిగ్రీగానే పరిగణిస్తారు. ఆనర్స్ డిగ్రీ విద్యార్థులు చివరి సంవత్సరం పూర్తిగా ఫార్మా కంపెనీల్లో ఇంటర్న్‌షి్‌పగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగాలు అందించేందుకు నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు, జీనోమ్ వ్యాలీలోని ప్రముఖ ఫార్మా కంపెనీలతో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు అందించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మహమూద్ తెలిపారు. ఫార్మా సంస్థల్లో 100 శాతం ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆనర్స్ డిగ్రీ తర్వాత ఉన్నత విద్య చదవాలని భావిస్తే నేరుగా కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, జెనొటిక్స్, బయో కెమిస్ట్రీ, ఫోరెన్సిక్‌లో పీహెచ్‌డీ చేసే అవకాశం ఉందని అన్నారు. దోస్త్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉందని, దోస్త్‌లో లేని కొన్ని కాలేజీల్లోనూ సీట్లు అందుబాటులో ఉన్నాయని మహమూద్ తెలిపారు.