BRSA Leaders File Complaint: ఆ బడాబాబుల భరతం పట్టండి
ABN , Publish Date - Oct 02 , 2025 | 04:53 AM
గాజులరామారంలోని 307 సర్వేనంబర్‌లో 317 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడాలంటూ.....
వారి చెరలోని గాజులరామారంప్రభుత్వ భూములను రక్షించండి
‘హైడ్రా’కు బీఆర్‌ఎస్ నేతలు మాధవరం, దాసోజు ఫిర్యాదు
317 ఎకరాలను అరికెపూడి కబ్జా చేశారని ఆరోపణ
అన్నీ నిరాధారమైన ఆరోపణలే.. కొట్టిపారేసిన అరికెపూడి
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): గాజులరామారంలోని 307 సర్వేనంబర్‌లో 317 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడాలంటూ.. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం హైడ్రా కార్యాలయానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వెళ్లి కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిశారు. గాజులరామారంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని, బడాబాబుల్లో కొందరు అక్కడి ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు. అనంతరం మాధవరం, దాసోజు మాట్లాడారు. స్థానిక తహసీల్దార్ మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు, విజిలెన్స్ నుంచి హైడ్రా వరకు అన్ని సంస్థలకూ, గాజులరామారం ప్రభుత్వ భూములను రక్షించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేసినట్లు బీఆర్‌ఎస్ నేతలు వెల్లడించారు. 307 సర్వేనంబరు ప్రభుత్వ భూముల్లో అక్రమాలను వెలికి తీయడమే కాకుండా, ఆ భూముల్లో భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కూడా వినతి పత్రం సమర్పించినట్లు వెల్లడించారు. అక్కడి వెంచర్లలోని ప్లాట్లను ఎవ్వరూ కొనద్దని విజ్ఞప్తి చేశారు. కాగా గాజులరామారంలో రూ.వేలకోట్ల విలువైన 320 ఎకరాల ప్రభుత్వ భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కబ్జా చేశారని ఎమ్మెల్సీ శ్రవణ్ ఆరోపించారు. ఆయనతో పాటు అనేకమంది పెద్దలు ఇక్కడి భూముల్లో వెంచర్లు వేశారని, ప్రభుత్వ భూములను కబ్జా చేసి క్రమబద్ధీకరించుకునేందుకే కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లారని, వారిని సీఎం కాపాడుతున్నారని ఆరోపించారు.
అన్నీ నిరాధారమైన ఆరోపణలే: అరికెపూడి
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లుగా తనపైన, తన కుటుంబ సభ్యులపైనా కొందరు ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ నిరాధారమైనవి, రాజకీయ ప్రేరేపితమైనవి అంటూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కొట్టిపారేశారు. గాజులరామారం సర్వే నంబర్ 307 (పార్ట్)లోని భూమి, ల్యాండ్ రికార్డ్ చట్టం ప్రకారం అమ్మకందారులకు ‘‘రిటైనబుల్ ల్యాండ్’’గా వచ్చినదాన్ని తాము కొనుగోలు చేశామని చెప్పారు. 1991 నుంచీ రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి ‘‘పట్టా భూమి’’గానే ఉందన్నారు. 1991లో పట్టా భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం మ్యూటేషన్ అయిన 11 ఎకరాలను తాను రాజకీయ జీవితం ప్రారంభించకముందే 2006లో చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. 2008లో అమ్మకందారుల్లో ఒకరు ఏపీఎ్‌సఎ్‌ఫసీ నుంచి జోక్యం ఉంటుందనే ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించారని, ఎపీఎ్‌సఎ్‌ఫసీ తన కౌంటర్ అఫిడవిట్‌లో ఈ భూమి వారిది కాదని స్పష్టం చేసిందని, వేరొక పిటిషన్‌లో ఆ భూములు ఇనాం భూములు కాదని న్యాయబద్ధంగా నిర్ధారించినట్లు ఆయన వివరించారు. సెప్టెంబరు 21న హైడ్రా అధికారులు తమకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, తమ భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్‌ను కూల్చివేశారని, దీంతో తాము హైకోర్టును ఆశ్రయించగా, దానిపై హైడ్రా ప్రవేశం లేకుండా ఉత్తర్వులు వచ్చాయని, ప్రస్తుతం. ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని వివరించారు. కొంతమంది రాజకీయ సహచరులు తప్పుడు ఆరోపణలతో రిట్ పిటిషన్లు దాఖలు చేశారని, వాటిలో ఒకటి డిస్మిస్ అయిందని, మరొకటి తన అప్పీల్‌తో కలిసి కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు హైడ్రా నుంచి గానీ, రాజకీయ సహచరుల నుంచి గానీ ఎటువంటి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదని, సహేతుకమైన ఆరోపణలు చేసిన వారికి.. తమ అధీనంలోని భూమిని ప్రైవేట్ పట్టా భూమి అని నిరూపించేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.