BRS Workers Attack Houses in Kagazmaddur: ఓటమి భారంతో రాళ్ల దాడి
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:09 AM
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భారాన్ని తట్టుకోలేక బీఆర్‌ఎస్ కార్యకర్తలు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్‌మద్దుర్ గ్రామంలో బుధవారం రాత్రి వీరంగం సృష్టించారు.
మెదక్ జిల్లా కాగజ్‌మద్దుర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణుల వీరంగం !
డబ్బు తిరిగి ఇవ్వాలని రెండు కులసంఘాలపై ఒత్తిడి, హింస
నర్సాపూర్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భారాన్ని తట్టుకోలేక బీఆర్‌ఎస్ కార్యకర్తలు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్‌మద్దుర్ గ్రామంలో బుధవారం రాత్రి వీరంగం సృష్టించారు. ఇళ్లు, దుకాణాలపై రాళ్లు రువ్వి అలజడి సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన తాజా మాజీ సర్పంచ్ శివకుమార్ భార్య విజయ.. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్ సతీమణి రాణిపై గెలిచి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన బీఆర్‌ఎస్ శ్రేణులు గ్రామంలో వీరంగం సృష్టించారు. ఇళ్లు, దుకాణాలపై రాళ్లు రువ్వారు. విషయం తెలిసి ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దాడులకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలని బీఆర్‌ఎస్ శ్రేణులు రెండు కుల సంఘాలపై ఒత్తిడి తెచ్చినట్లు, ఆ క్రమంలోనే దాడులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.