Mother Dairy Elections: మదర్ డెయిరీ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:04 AM
నల్లగొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ మదర్ డెయిరీఎన్నికల్లో అధికార కాంగ్రె్‌సకు ఎదురుదెబ్బ తగిలింది...
మూడు డైరెక్టర్ పదవుల్లో రెండు బీఆర్‌ఎస్ కైవసం
కాంగ్రెస్ బలపరిచిన వారిలో ఒకరు మాత్రమే గెలుపు
హయత్‌నగర్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ-రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (మదర్ డెయిరీ) ఎన్నికల్లో అధికార కాంగ్రె్‌సకు ఎదురుదెబ్బ తగిలింది. మదర్ డెయిరీ పాలకవర్గంలోని మూడు డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో రెండింటిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఒక్క డైరెక్టర్ పదవి మాత్రమే అధికార పార్టీకి దక్కింది. శనివారం నగరంలోని హయత్‌నగర్ ఎస్‌వీ కన్వెన్షన్‌లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రెండు జనరల్ స్థానాల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి (154 ఓట్లు) సందిల భాస్కర్‌గౌడ్ (240 ఓట్లు) గెలుపొందారు. ఇక మరో స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించగా.. కాంగ్రెస్ బలపరిచిన కర్నాటి జయశ్రీ (176 ఓట్లు) గెలుపొందారు. కాగా, మూడు స్థానాలకుగాను బీఆర్‌ఎస్ రెండింట్లో గెలుపొంది సత్తా చాటగా.. కాంగ్రెస్ నాయకుల అంతర్గత పోరుతోనే ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలైనట్లు భావిస్తున్నారు. ఎన్నికల అనంతరం కొందరు రైతులు మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదని, తాము ఎలా జీవించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ పదవి నుంచి మధుసూదన్‌రెడ్డి దిగిపోవాలని డిమాండ్ చేశారు.