Share News

BRS approached the Election Commission: పోలింగ్‌ నిష్పక్షపాతంగా జరిగేలా చూడండి

ABN , Publish Date - Nov 07 , 2025 | 02:08 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలింగ్‌ జరిగేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్‌ఎస్‌ కోరింది. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు..

BRS approached the Election Commission: పోలింగ్‌ నిష్పక్షపాతంగా జరిగేలా చూడండి

  • పోలింగ్‌ స్టేషన్లలో ప్రత్యక్ష వెబ్‌ కాస్టింగ్‌ పెట్టండి

  • జూబ్లీహిల్స్‌కు కేంద్ర బలగాలను తరలించండి

  • కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ వినతి

న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలింగ్‌ జరిగేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్‌ఎస్‌ కోరింది. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార కాంగ్రెస్‌ అడ్డదారులు తొక్కుతోందని ఫిర్యాదు చేసింది. గురువారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్‌ రెడ్డి, ఎంపీలు దామోదర్‌ రావు, పార్థసారధి రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ‘సీఎం రేవంత్‌ రెడ్డి ఆరురోజులుగా ప్రచారం చేస్తున్నారు. మంత్రివర్గమంతా అక్కడే ఉంది. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కానీ అజారుద్దీన్‌కు మంత్రిగా అవకాశం కల్పించారు. హోం మంత్రిత్వ శాఖ కూడా సీఎం వద్దే ఉంది. అందుకే.. ఆయన పోలీసు వ్యవస్థ ద్వారా స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారు. మున్సిపల్‌ అధికారులతో నోటీసులు ఇప్పిస్తున్నారు. భయానక పరిస్థితి కల్పిస్తున్నారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ రిగ్గింగ్‌, అక్రమాలు చేయాలని చూస్తోంది. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండడం, బుర్ఖా ధరించే సంప్రదాయం ఉండడాన్ని అవకాశంగా భావించి డజన్ల కొద్దీ మహిళలను కాంగ్రెస్‌ ముందే తరలించింది. వారితో రిగ్గింగ్‌ చేయించాలని చూస్తోంది. తెలంగాణ ప్రధాన ఎన్నిక అధికారికి చెబితే పట్టించుకోవడం లేదు. రిగ్గింగ్‌, హింస జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘తక్షణమే కేంద్ర బలగాలను జూబ్లీహిల్స్‌కు తరలించండి. అన్ని పోలింగ్‌ ేస్టషన్లలో కేంద్రం పర్యవేక్షణలో సీసీ టీవీ కెమెరాలు, ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయండి. ఫంక్షన్‌ హాళ్లు, లాడ్జిలు, నివాసాలపై ప్రత్యేక నిఘా ఉంచండి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, ధైర్యంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే వాతావరణం కల్పించండి’ అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్‌ఎస్‌ ఆ లేఖలో కోరింది.

మా ఫిర్యాదులపై సీఈవో స్పందించడంలేదు: వినోద్‌కుమార్‌

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాలు కోడ్‌ను ఉల్లంఘించేలా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ తరఫున చేసిన ఫిర్యాదులపై సీఈవో సుదర్శన్‌రెడ్డి స్పందించడం లేదని ఆ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆరోపించారు. కాంగ్రె్‌సకు ఓటు వేయకపోతే పథకాలు బంద్‌అవుతాయని సీఎం అనడం, బీఆర్‌ఎ్‌సకు ఓటేేస్త జూబ్లీహిల్స్‌కు రానని అజారుద్దీన్‌ అనడం కోడ్‌ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు చేసిన ఫిర్యాదులపై స్పందించకుండా కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత వైఖరితో పనిచేస్తోందని ఆరోపించారు. తమ ఫిర్యాదులపై ఈసీఐ తక్షణం స్పందించాలని వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 07 , 2025 | 02:08 AM