BRS Ready to Submit: స్పీకర్ నోటీసులపై బీఆర్‌ఎస్ సమాధానాలు సిద్ధం
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:38 AM
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి శాసనసభ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు బీఆర్‌ఎస్ సమాధానాలు సిద్ధం చేసింది. తమ పార్టీ నుంచి పది మంది...
నేడో, రేపో స్పీకర్ కార్యాలయానికి అందజేత
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి శాసనసభ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు బీఆర్‌ఎస్ సమాధానాలు సిద్ధం చేసింది. తమ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరారని, వారిపై చర్యలు తీసుకోవాలని గతంలోనే స్పీకర్‌కు ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. చర్యలు తీసుకోవడం ఆలస్యం అవుతుందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ తరువాత స్పీకర్ కార్యాలయం 8 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చింది. బీఆర్‌ఎస్ ఇచ్చిన ఫిర్యాదులను జతచేస్తూ, సమాధానం చెప్పాలని అడిగింది. దాంతో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు సమాధానం ఇచ్చారు. తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమాధానాలను పరిశీలించిన స్పీకర్.. మీకేమైనా అభ్యంతరాలున్నాయా? అంటూ మళ్లీ బీఆర్‌ఎస్ తరఫున పిటిషన్ వేసినవారికి నోటీసులిచ్చారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ నేతలు సమాధానం సిద్ధం చేశారు. 10 మంది ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించారంటూ ఆధారాలను, ఫొటోలను జత చేశారు. ఆ సమాధానాలను నేడో, రేపో స్పీకర్ కార్యాలయానికి అందించనున్నారు.