BRS Protest: బీఆర్‌ఎస్ చలో బస్‌భవన్ ఉద్రిక్తం
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:04 AM
హైదరాబాద్ సిటీ బస్సుల చార్జీల పెంపునకు నిరసనగా చలో బస్‌భవన్ పేరిట బీఆర్‌ఎస్ గురువారం చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది...
సిటీ బస్సుల్లో చార్జీల పెంపునకు నిరసనగా కార్యక్రమం
ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు
కాలినడకన బస్ భవన్‌కు వెళ్లి ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం అందజేత
క్రాస్‌రోడ్స్‌కు భారీగా బీఆర్‌ఎస్ శ్రేణులు
ధర్నా, బస్సులను అడ్డుకునే యత్నం
పోలీసుల అదుపులో పలువురు
రాంనగర్, చిక్కడపల్లి, నార్సింగ్, కార్వాన్ అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ సిటీ బస్సుల చార్జీల పెంపునకు నిరసనగా చలో బస్‌భవన్ పేరిట బీఆర్‌ఎస్ గురువారం చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. చలో బస్‌భవన్ కోసం గురువారం ఉదయం నుంచే బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు చేరుకోగా.. ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావు సహా నగరంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు వేర్వేరు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్ సిటీ బస్సు దిగుతుండగా పార్టీ కార్యకర్తలు సీఎంసీఎం అంటూ నినదించారు. కేటీఆర్, హరీశ్, తలసాని శ్రీనివా్‌సయాదవ్, పద్మారావు గౌడ్, సబితారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరలు కార్యకర్తలతో కలిసి క్రాస్‌రోడ్స్ నుంచి బస్ భవన్ వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లారు. అనంతరం బస్ భవన్‌లోకి వెళ్లిన నేతలు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. మరోపక్క, బస్‌భవన్ బయట బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆ మార్గంలో వచ్చిన బస్సులను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అలాగే, బస్‌భవన్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన బీఆర్‌ఎస్ శ్రేణులను కూడా పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగ్గా.. పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు.
అంతకుముందు హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జైసింహ సహా పలువురు నేతలను పోలీసులు గురువారం ఉదయం కాసేపు హౌస్ అరెస్టులు చేశారు. చలో బస్‌భవన్ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు సార్లు బస్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని ఆరోపించారు. ప్రజారవాణా వ్యవస్దలో నష్టాలు వస్తే ప్రభుత్వాలే భరించాలి కానీ ప్రజలపై భారం వేయడమేంటని ప్రశ్నించారు. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చలో బస్‌భవన్‌కు వచ్చే నేతల హౌస్ అరెస్టులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, సిటీ బస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో బీఆర్‌ఎస్ పోరాటం ఆగదని హరీశ్‌రావు పేర్కొన్నారు మహిళల ఉచిత ప్రయాణం పేరుతో ఆ భారాన్ని పురుషులపై మోపుతున్నారని తెలిపారు. టికెట్ రేట్లు, వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంపు వంటి నిర్ణయాలతో సీఎం రేవంత్ ప్రజలను దొంగ దెబ్బ కొడుతున్నారని ఆరోపించారు.