BRS Working President KTR: విత్తన బిల్లుకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:23 AM
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విత్తన బిల్లు ముసాయిదాను బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు....
కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రతిపాదనలు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విత్తన బిల్లు ముసాయిదాను బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కేంద్రం ప్రతిపాదించిన విత్తన బిల్లు రైతుల కోసం కాకుండా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం తెచ్చినట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. విత్తన ట్రయల్స్ లేకుండా విదేశీ కంపెనీలు దేశంలో తమ విత్తనాలను అమ్ముకునేందుకు వీలుగా ఆ బిల్లులో నిబంధనలు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఆ విధానాల వల్ల దేశీయ విత్తన భద్రత, విత్తన సార్వభౌమత్వం ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు. రాష్ట్రాలకు, వ్యవసాయ యూనివర్సిటీలకు బిల్లులలో ప్రాధాన్యం లేకుండా చేశారని తెలిపారు. రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంలో కీలకమైన విత్తనాల అంశంపై అధికారం ఆ బిల్లులోని అంశాల వల్ల కేంద్రం చేతుల్లోకి వెళుతుందని చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు చట్టాలు చేసుకునే అంశాన్ని బలహీనం చేసేలా ప్రతిపాదిత చట్టం ఉందని కేటీఆర్ తెలిపారు. నకిలీ విత్తనాల కట్టడి అంశంపై, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే అంశంపై బిల్లులో స్పష్టత లేదన్నారు. అలాగే, కార్పొరేట్ కంపెనీలు తమకు అనుకూలంగా విత్తనాల ధరలను నిర్ణయించేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయన్నారు. నకిలీ విత్తనాలను తయారు చేసిన కంపెనీలను కాకుండా కేవలం అమ్మకందారులను బాధ్యులను చేసేలా చట్టం రూపొందించారన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ విత్తన చట్టం ముసాయిదాను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ విత్తన బిల్లు అంశంపై బీఆర్‌ఎస్ తరఫున త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కేంద్రానికి సూచనలు చేస్తామని పేర్కొన్నారు. రైతులు, రైతు సంఘాలు, నిపుణులు, రాజకీయపార్టీలతో చర్చించిన తర్వాతే విత్తన బిల్లుపై కేంద్రం ముందుకు వెళ్లాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.