BRS MLC Dasoju Shravan: సీటుకు మూట.. ఇది సరికొత్త వ్యాపార ప్రజాస్వామ్య సూత్రం
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:13 AM
ఓటరుకు నోటు, సీటుకు మూట.. ఎన్నికలు వద్దు.. పదవులకు వేలం పాటలే ముద్దు.. ఇది సరికొత్త పెట్టుబడిదారీ వ్యాపార ప్రజాస్వామ్య సూత్రంగా మారింది..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘ఓటరుకు నోటు, సీటుకు మూట.. ఎన్నికలు వద్దు.. పదవులకు వేలం పాటలే ముద్దు.. ఇది సరికొత్త పెట్టుబడిదారీ వ్యాపార ప్రజాస్వామ్య సూత్రంగా మారింది’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు కాదు వ్యాపార.. వేలం పాటలే నడుస్తున్నాయన్నారు. సర్పంచ్ పోస్టులు అభ్యర్థులతో కాదు.. బిడ్డర్లతోనే నియమించబడుతున్నాయని పేర్కొన్నారు. రూకగ్రీవాలు శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాన్ని పోస్టు పెడుతూ.. ప్రస్తుత పరిస్థితిపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇలాపోతే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కూడా ఏకగ్రీవాలవుతాయని, అదే జరిగితే.. ఓటర్లకు.. ప్రభుత్వానికీ, ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ భారమే ఉండదని, వేలకోట్ల ప్రజాధనం ఖర్చుకాకుండా ఆదా అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రచారం లేదు.. ర్యాలీలు ఉండవు.. ఓటింగ్ కోసం చాంతాడం త లైన్లలో నిలబడే ఇబ్బందీ ఉండదని పేర్కొన్నారు. ఈవీఎంలు, పోలింగ్ బూత్‌లు, ఎన్నికల సిబ్బంది, పోలీసులు, సెక్యూరిటీ ఏవీ అవసరం లేకుండా ఆన్‌లైన్ వేలంతోనే పని అయిపోతుందని, ఎవరు ఎక్కువ బిడ్ వేస్తారో.. వారే గెలుస్తారన్నారు.