Share News

Supreme Court: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపు.. నేడు సుప్రీంలో విచారణ

ABN , Publish Date - Nov 17 , 2025 | 05:43 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

 Supreme Court: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపు.. నేడు సుప్రీంలో విచారణ

  • గత నెల 31తో ముగిసిన గడువు.. పొడిగించాలని కోర్టును కోరిన స్పీకర్‌

  • స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్‌ పిటిషన్‌

  • ఆ 10 మందిని అనర్హులుగా ప్రకటించాలని మరో పిటిషన్‌

న్యూఢిల్లీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణకు సుప్రీంకోర్టు గతంలో విధించిన గడువు అక్టోబర్‌ 31వ తేదీతో ముగిసింది. దీంతో మరో 8 వారాలు గడువు పొడిగించాలని అదేరోజు స్పీకర్‌ కార్యాలయం కోర్టును కోరింది. రోజువారీ కార్యాక్రమాలు, స్పీకర్ల అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనలు తదితర కార్యక్రమాల్లో స్పీకర్‌ బిజీగా ఉన్నందున గడువులోగా విచారణ సాధ్యంకాలేదని తెలిపింది. మరోవైపు స్పీకర్‌ ఉద్దేశపూర్వకంగానే విచారణ ఆలస్యం చేస్తున్నారని, అందువల్ల స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే, ఆ పదిమంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మరో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్లు అన్నింటినీ కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌, జస్టిస్‌ అంజారియాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించనుంది. విచారణకు స్పీకర్‌కు మరికొంత సమయం ఇస్తారా? ఇస్తే ఎంత సమయం ఇస్తారు? అనేదానిపై సోమవారం స్పష్టత రానుంది. కాగా, ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలను ఇంతవరకూ స్పీకర్‌ విచారించలేదనే అంశంపైనే బీఆర్‌ఎస్‌ వాదనలు వినిపించే అవకాశం ఉంది. 24న సీజేఐ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారా? మరో ధర్మాసనం వద్దకు పంపుతారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Updated Date - Nov 17 , 2025 | 05:44 AM