Political Clarification: నేను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే..
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:10 AM
నేను పార్టీ మారలేదు! ఇప్పటికీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే సభలో కొనసాగుతున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం..
నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశా
నేను కప్పుకొన్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు..
జాతీయ జెండాలోని 3 రంగులతో కూడిన కండువా
స్పీకర్‌కు వేర్వేరుగా వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు
మరింత సమయం కావాలంటూ మిగతా ఇద్దరి విజ్ఞప్తి
వివరణల ఆధారంగా బీఆర్‌ఎ్‌సకు నోటీసులిచ్చిన స్పీకర్!
విచారణకు హాజరై వాదనలు వినిపించాలని సూచన
హైదరాబాద్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘‘నేను పార్టీ మారలేదు! ఇప్పటికీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే సభలో కొనసాగుతున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలిసినట్లుగానే.. నేనూ నా నియోజకవర్గ అభివృద్ధి పనులపైనే రేవంత్‌రెడ్డిని కలిశాను. నేను కలిసినప్పుడు.. సీఎం రేవంత్ నా మెడలో వేసింది కాంగ్రెస్ కండువా కాదు. జాతీయ జెండాలోని మూడు రంగులతో కూడిన కండువా!’’ - బీఆర్‌ఎస్ ఇచ్చిన అనర్హత పిటిషన్‌కు సంబంధించి స్పీకర్ ప్రసాద్‌కుమార్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు.. కాస్త అటు, ఇటుగా ఇచ్చిన వివరణ ఇది. స్పీకర్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు నోటీసులు అందుకోగా, వారిలో 8 మంది ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. మిగిలిన ఇద్దరూ వివరణ ఇచ్చేందుకు మరి కొంత గడువు కావాలని స్పీకర్‌ను కోరినట్లు తెలుస్తోంది. వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, ప్రకాశ్‌గౌడ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సహా మరో ఇద్దరు ఉన్నారు. వివరణ ఇచ్చిన వారందరూ.. తాము పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, ఆధారాలను సమర్పించారు. శాసన సభలో బీఆర్‌ఎస్ సభ్యులు 38 మంది ఉన్నారంటూ అనేక సందర్భాల్లో కేటీఆర్, హరీశ్‌రావు చెప్పారని, తద్వారా తమను బీఆర్‌ఎస్ సభ్యులుగానే వారు పేర్కొన్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపైన అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు సీఎంను కలవడం దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయమేనని, తాము కూడా అభివృద్ధి పనులపైనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని వివరించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చే వేతనంలో నెలకు రూ.5 వేలు.. పార్టీ ఫండ్ కింద కట్ అవుతాయని, ఈ ఏడాది మార్చి వరకూ తమ వేతనం నుంచి పార్టీ ఫండ్‌ను తీసుసుకున్నారంటూ సంబంధిత ఆధారాలను సమర్పించారు.
అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవిని ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వడం సంప్రదాయమని, అందువల్లే తనకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని అరికెపూడి వివరణ ఇచ్చినట్లు సమాచారం. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్ నేతలు గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారని స్పీకర్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ ఆధారంగా బీఆర్‌ఎ్‌సకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపినట్లు సమాచారం. బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతున్నామంటూ ఆయా ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారని, ఆధారాలూ సమర్పించారని పేర్కొంటూ.. విచారణకు పిలిచినప్పుడు హాజరై వాదనలు వినిపించాలని బీఆర్‌ఎ్‌సకు సూచించినట్లు సమాచారం. కాగా, అనర్హత అంశంపై ఒక్కో ఎమ్మెల్యేను స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వయంగా విచారించనున్నారు. ఆ విచారణకు పిటిషన్‌ను దాఖలు చేసిన బీఆర్‌ఎస్ ప్రతినిధి, ఫిరాయింపు ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే.. తమ న్యాయవాదులతో హాజరు కావాల్సి ఉంటుంది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత.. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అసెంబ్లీ వర్గాలు తెలాపాయి.