KTR: కేటీఆర్ సెల్ఫ్ గోల్!
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:03 AM
బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు. అధికార కాంగ్రెస్ ఎలాంటి సవాల్ చేయకముందే..
బెడిసికొట్టిన సవాల్
ఉప ఎన్నిక కాంగ్రెస్ సర్కార్‌కు రెఫరెండం అని ప్రకటన
ఈ ఎన్నిక.. తెలంగాణ ప్రజానీకానికి ఓ కనువిప్పు అని వ్యాఖ్యలు
అధికార పార్టీ సవాల్ చేయకముందే..
తానే సవాల్ విసిరి ఓడిపోయిన బీఆర్‌ఎస్
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు. అధికార కాంగ్రెస్ ఎలాంటి సవాల్ చేయకముందే.. తానే ఓ అడుగు ముందుకేసి సవాల్ విసిరి ఇరకాటంలో పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సమయంలో జరుగుతున్న ఈ ఉపఎన్నిక.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండమని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఈ ఎన్నిక.. తెలంగాణ ప్రజానీకానికి ఓ కనువిప్పు అవుతుందని అన్నారు. ఇటీవల ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జూబ్లీహిల్స్ సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వ్యూహాలు పన్నిన బీఆర్‌ఎస్.. చివరికి ఓటమిపాలైంది. కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో చేసిన ప్రయోగం విఫలం అయినప్పటికీ.. మళ్లీ జూబ్లీహిల్స్‌లో అదే ప్రయోగం చేసి మరో అపజయాన్ని మూటగట్టుకుంది. మాగంటి సునీత సెంటిమెంట్ అస్త్రం కూడా ఫలించలేదు. అయితే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకున్నారు. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో అనుభవం కలిగిన పార్టీ సీనియర్లను జూబ్లీహిల్స్‌లో మోహరించారు. వార్డులు, పోలింగ్ బూత్‌ల వారిగా ఇన్‌చార్జులను నియమించారు. ప్రతి వంద మంది ఓటర్లకొక బాధ్యుడినీ పెట్టారు. గతంలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా.. సూనాయసంగా గెలిచిన బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్‌లో మాత్ర బొక్కబోర్లా పడింది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీని కాస్త ఇరకాటంలో పెట్టాయనే చెప్పవచ్చు. ఈ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండమని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఈ ఎన్నిక.. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఓ కనువిప్పు అవుతుందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని, రేవంత్ రెడ్డి-నరేంద్రమోదీ చోటాభాయ్, బడా భాయ్ సంబంధమనీ వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. ఫలించలేదు. ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. సాధారణంగా ‘రెఫరెండం’ అనే సవాల్‌ను అధికారంలో ఉన్న పార్టీలు చేస్తుంటాయి. తమ పాలనకు ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది? ఎన్నికల్లో గెలిస్తే పాలనను ఆమోదించినట్లు.. గెలవకపోతే పాలనను తిరస్కరించినట్లు.. అని సవాల్ విసరుతుంటారు. కానీ ఈ ఉప ఎన్నికలో అధికారపార్టీ నుంచి ఎలాంటి సవాల్ రాకపోయినా.. ప్రతిపక్ష నేత కేటీఆర్ ఓ అడుగు ముందుకేసి రెఫరెండం సవాల్ విసిరి సెల్ఫ్‌గోల్‌లో పడినట్లయింది.