Kanche Gachibowli controversy: పోలీసుస్టేషన్ కు మన్నె క్రిశాంక్
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:36 AM
కంచె గచ్చిబౌలి భూములపై ఏఐ సహాయంతో తప్పుడు పోస్టులు చేశారన్న కేసులో బీఆర్‌ఎస్ నేతలు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారు విచారణకు హాజరై ప్రభుత్వం తమను అక్రమంగా వేధిస్తోందని ఆరోపిస్తూ, తప్పులను ప్రశ్నించడమే చేసిన తప్పని తెలిపారు.

9 గంటలపాటు విచారణ
రాయదుర్గం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ఉపయోగించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు చేశారంటూ బీఆర్‌ఎస్ నేతలు మన్నె క్రిశాంక్, కొణతం దిలీ్‌పకుమార్‌కు గచ్చిబౌలి పోలీసులు ఈ నెల 9, 10, 11 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం ఉదయం 11.30కు క్రిశాంక్, దిలీ్‌పకుమార్ గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. 9 గంటలకు పైగా పోలీసులు వారిని విచారించారు. ఏప్రిల్ 14న తిరిగి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన క్రిశాంక్, దిలీప్ మాట్లాడుతూ.. తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. కంచె గచ్చిబౌలి భూముల్లో విధ్వంసాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన తమను అక్రమ కేసులు, విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తలంటినా బుద్ధి రాలేదని విమర్శించారు. తాము భయపడేది లేదని, ఈ ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. తాము పోలీసుల విచారణకు ఉదయం 11 గంటలకు వస్తే మధ్యాహ్నం 1 గంటకు రెండు ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఎందుకు పోస్టులు పెట్టారు? ఎలా పెట్టారని ప్రశ్నించారని వెల్లడించారు. దానికి తాము రేవంత్‌రెడ్డి హెచ్‌సీయూ భూముల్లో జింకలు లేవని చెప్పడంతో.. జింకల ఫొటోలను ఫోన్ ద్వారా పెట్టామని సమాధానమిచ్చామన్నారు. అనంతరం పోలీసులు ఏడు గంటల పాటు తమను కూర్చోబెట్టారని తెలిపారు. ఆ తర్వాత పై నుంచి ఓ ప్రశ్నల పేపర్ వచ్చిందని, మిమ్మల్ని ఎవరైనా పంపించారా? అని ప్రశ్నించి కేసీఆర్, కేటీఆర్‌ను ఇరికించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హెచ్‌సీయూ విద్యార్థులు పెట్టిన వాటినే తాము పెట్టామని సమాధానం చెప్పినట్లు వెల్లడించారు. పోలీసులు తమ మొబైల్ ఫోన్లు ఇవ్వాలని అడిగారని, తాము లేవని చెప్పడంతో తమ ఇళ్లలో సోదాలు చేసేందుకు చూస్తున్నారన్నారు.