Share News

BRS leaders KTR: ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగం

ABN , Publish Date - Oct 28 , 2025 | 04:20 AM

కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగం అయ్యాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌రావు అన్నారు....

BRS leaders KTR: ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగం

  • వారికిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు

  • ఆటోడ్రైవర్లకు మద్దతుగా ఆటోలో ప్రయాణించిన నేతలు

  • కాంగ్రెస్‌ క్యాబినెట్‌ దండుపాళ్యం ముఠాయే.. పదిసార్లంటా

  • రజక సంఘం సమ్మేళనంలో హరీశ్‌

హైదరాబాద్‌/బంజారాహిల్స్‌/ఎర్రగడ్డ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగం అయ్యాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఆటోడ్రైవర్లకు హామీలిచ్చిన కాంగ్రెస్‌.. గద్దెనెక్కిన తరువాత వారిని మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేలు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారని, దాని ప్రకారం ప్రతి ఆటోడ్రైవర్‌కూ రూ.24 వేల చొప్పున మొత్తం రూ.1500 కోట్లు ప్రభుత్వం బాకీ పడిందని తెలిపారు. ఈ మొత్తాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ఆటోవాలాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు, ఆటోడ్రైవర్లకు మద్దతుగా నిలిచేందుకు సోమవారం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి తెలంగాణ భవన్‌ వరకు కేటీఆర్‌ ఆటోలో ప్రయాణించారు. మరోవైపు హరీశ్‌రావు ఎర్రగడ్డలోని గోకుల్‌ థియేటర్‌ నుంచి తెలంగాణ భవన్‌ వరకు నుంచి ఆటోలో ప్రయాణించారు. అనంతరం ఆటో కార్మికులతో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. తాను ప్రయాణించిన ఆటో డ్రైవర్‌ మస్రత్‌ అలీ తనతో ఎన్నో బాధలు పంచుకున్నారని తెలిపారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌గాంధీ ప్రయాణానికి ఆటో ఇచ్చిన యజమాని.. రెండేళ్లలో తనకున్న రెండు ఆటోలు అమ్ముకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన డ్రైవర్‌గా మారి కిరాయిఆటోతో రోజుకు రూ.1000-1200 మాత్రమే సంపాదిస్తున్నారని, ఈ ఆదాయం ఆటో కిరాయి, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు సరిపోవడంలేదని బాధపడ్డారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు 161 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించామని గుర్తుచేశారు.


బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్‌ హయాంలో ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 4లక్షల మంది జూబ్లీహిల్స్‌ ఓటర్లు తీసుకునే నిర్ణయంతో 4కోట్ల తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో చనిపోయిన ఆటోకార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ప్రతి ఆటోడ్రైవర్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ.. మగవాళ్లకు మాత్రం టికెట్‌ రేట్లు రెండింతలు పెంచి కుటుంబంపై భారం వేశారని ఆరోపించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందిస్తూ.. మంత్రివర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునన్నారు. తమ పార్టీ నేత కొప్పుల ఈశ్వర్‌ విసిరిన సవాల్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ స్వీకరించాలని, 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు రావాలని అన్నారు.

రజకుల ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆరే..

రాష్ట్రంలోని రజకుల ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆరేనని హరీశ్‌రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్థంతిని అధికారికంగా నిర్వహించి ఆమె గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్‌లో రజక సంఘం ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో అక్రమాలు, బూతులు తిట్టడం తప్ప.. చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. జూబ్లిహిల్స్‌ ఓటర్లు బీఆర్‌ఎ్‌సను గెలిపించి.. రేవంత్‌రెడ్డి గూబ గుయ్యిమనిపించాలన్నారు. కాగా, ముధోల్‌ నియోజకవర్గ బీజేపీ నేత సిందే దీక్షిత్‌, ఆయన అనుచరులు బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌ కచ్చితంగా దండుపాళ్యం ముఠాయేనని, ఈ మాట ఒక్కసారి కాదు.. పదిసార్లు అంటానని చెప్పారు. దక్కన్‌ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించిన వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు సిద్ధమా? అని సవాల్‌ చేశారు.

1.jpg

Updated Date - Oct 28 , 2025 | 04:20 AM