Share News

BRS Faces Setbacks After Power Loss: అధికారం పోయాక అంతటా ఓటమే!

ABN , Publish Date - Nov 15 , 2025 | 05:34 AM

ఎన్నికలు ఏవైనా గెలుపు తమదేనంటూ అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా చెప్పుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.....

BRS Faces Setbacks After Power Loss: అధికారం పోయాక అంతటా ఓటమే!

  • లోక్‌సభతోపాటు రెండు ఉప ఎన్నికల్లో ఖాతా తెరవని బీఆర్‌ఎస్‌

  • వరుస ఓటములు, అంతర్గత సమస్యలతో సతమతం

  • తలనొప్పిగా మారిన కల్వకుంట్ల కవిత వ్యవహారం

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో పట్టు కోల్పోతోందన్న అభిప్రాయాలు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ఏవైనా గెలుపు తమదేనంటూ అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా చెప్పుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయాక పూర్తిగా తిరగబడింది. అధికారం చేజారినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీఖాతా తెరవలేదు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిలపడింది. ఆ పార్టీ చరిత్రలో తొలిసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్న ఓట్లలో సగం కూడా లోక్‌సభ ఎన్నికల్లో తెచ్చుకోలేకపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 87.53 లక్షల ఓట్లు (37.35ు) రాగా, లోక్‌సభ ఎన్నికల్లో 36.48 లక్షల (16.68ు) ఓట్లు మాత్ర మే వచ్చాయి. ఆ తర్వాత కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో సిటింగ్‌ స్థానాన్ని కోల్పోయింది. తాజాగా మరో సిటింగ్‌ స్థానం జూబ్లీహిల్స్‌ను కూడా పోగొట్టుకుంది. ఈ రెండు ఉప ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్‌ గెలిచి మరింత బలపడితే, వరుస ఓటములతో బీఆర్‌ఎస్‌ డీలా పడింది.

తల బొప్పి కట్టిస్తున్న కవిత వ్యవహారం

వరుస ఓటములతో కుంగిపోతున్న బీఆర్‌ఎస్‌ పార్టీకి.. కల్వకుంట్ల కవిత తిరుగుబాటు మరింత తల బొప్పి కట్టేలా చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ‘నా తండ్రి కేసీఆర్‌ దేవుడు.. ఆయను చుట్టూ దెయ్యాలున్నాయి.. బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేస్తున్నారు.. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను’ అని ఆమె చేసిన ప్రకటనలు బీఆర్‌ఎస్‌ను మరింత ఇరుకున పెట్టేకుందుకు ప్రత్యర్థి పార్టీలకు ఆయుధాలుగా మారాయి. పార్టీ నుంచి ఆమెను బహిష్కరించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికీ ఆమె బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, సంతో్‌షరావులను టార్గెట్‌ చేస్తూ పదునైన విమర్శలు చేస్తుండటంతో ఎదురుదాడి చేయలేక, ఊరుకోలేక బీఆర్‌ఎస్‌ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాంగ్రె్‌సకు టచ్‌లోకి వెళ్లడం గులాబీ దళాన్ని మరింత ఒత్తిడిలోకి నెట్టింది.


సరిదిద్దుకోవాల్సిందే...!

తాజా రాజకీయ పరిణామాలే కాకుండా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించే క్రమంలో పార్టీ దృష్టికి వచ్చిన సమస్యలను ఇప్పటివరకూ పరిష్కరించలేదని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ కార్యకర్త ఒకరు అభిప్రాయపడ్డారు. ఓటమిపై విశ్లేషణ అంటూ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశాలు పెడితే... జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలు స్థానిక పరిస్థితులను సభాముఖంగా చెప్పారని, దిద్దుబాటు చర్యలు చేపడతామన్న కేటీఆర్‌ నేటికీ స్పందించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

పట్నంపై పట్టు పోతోందా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ నగరం, దాని సమీప నియోజకవర్గాల్లో సగానిపైగా గెలిచిన బీఆర్‌ఎస్‌.. క్రమంగా ఇక్కడ పట్టు కోల్పోతోందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఇక్కడ జరిగిన రెండు ఉప ఎన్నికల్లో సిటింగ్‌ స్థానాలను బీఆర్‌ఎస్‌ కోల్పోవటమే అందుకు కారణం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాలకుగాను 16 చోట్ల బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఆ తర్వాత కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు జరగ్గా.. రెండు చోట్లా ఆ పార్టీ ఓటమి మూటగట్టుకుంది. హైదరాబాద్‌ నగరం తమ అడ్డా అని చెప్పుకుంటున్న బీఆర్‌ఎ్‌సకు ఉప ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. ‘ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని సర్ది చెప్పుకునే పరిస్థితి లేదు. పార్టీకి పెట్టని కోటలా ఉన్న చోట పరాజయం సాధారణ విషయం కాదు. ఈ విషయంపై పార్టీలో చర్చ జరగాలి. మనం వెళ్తోన్న మార్గం సరైనదేనా..? ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది’ అని బీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు.

Updated Date - Nov 15 , 2025 | 05:34 AM