Share News

KTR Comments on Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయం

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:50 AM

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో.. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయం బయటపడిందని.. ఆర్‌ఎస్‌......

KTR Comments on Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయం

  • ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ సమీకరణ ఫలించింది!.. జూబ్లీహిల్స్‌ ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటాం

  • అంతర్గతంగా చర్చించుకుంటాం

  • రాష్ట్రంలో బీఆర్‌ఎస్సే ప్రత్యామ్నాయమని తేలింది: కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో.. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయం బయటపడిందని.. ఆర్‌ఎస్‌ (రేవంత్‌రెడ్డి, సంజయ్‌ను ఉద్దేశించి) బ్రదర్స్‌ సమీకరణ ఇక్కడ వర్కౌట్‌ అయినట్లు కనబడుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్‌కు మూడు రోజుల ముందు బండి సంజయ్‌ చేసిన ప్రచారం.. బీఆర్‌ఎ్‌సపై వ్యతిరేక ప్రభావం చూపిందని పరోక్షంగా ప్రస్తావించారు. బీజేపీ మాత్రం డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయిందన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎ్‌సదే గెలుపని సర్వే సంస్థలు మొదటినుంచీ చెప్పాయని, కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపుకోసం ఆ పార్టీ ఏం చేసిందో.. అందరికీ తెలుసన్నారు. ఏదేమైనా ప్రజాతీర్పును గౌరవిస్తామని, ఉప ఎన్నిక ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటామని, పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని వైఫల్యాలను గుర్తించి సరిచేసుకుంటామని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ ఎప్పుడూ చెబుతుంటారన్నారు. జూబ్లీహిల్స్‌ ఫలితాన్ని చూసి కుంగిపోమని, ఏ మాత్రం నిరాశ చెందకుండా.. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకోసం పనిచేస్తూ.. ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత.. జరిగిన ఈ ఉప ఎన్నిక ఫలితం ద్వారా బీఆర్‌ఎస్‌నే రాష్ట్రం లో ప్రత్యామ్నాయమని ప్రజలు తేల్చారని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో జరిగినట్లే.. ఇక్కడా పార్టీ మారిన నేతలను అనర్హులుగా ప్రకటిస్తే.. ఉపఎన్నికలు వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. ఒక్క జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకే ఇన్ని అపసోపాలు పడిన కాంగ్రెస్‌.. 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటుందోనని ఎద్దేవా చేశారు. గత రెండేళ్లుగా లగచర్ల మొదలు కాంగ్రెస్‌ చేసిన అనేక అరాచకాలు, అక్రమాలు, అవినీతిని ఎండగడుతూనే ఉంటామని ఆయ చెప్పారు.


హరీశ్‌లాంటి నేతలు, కార్యకర్తలు కష్టపడ్డారు

ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపుకోసం బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరంతరం శ్రమించాయని కేటీఆర్‌ అన్నారు. పండుగలు, వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి.. పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలు, ఆయా డివిజన్ల పరిధిలోని నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు తన తండ్రి మరణం తర్వాత కూడా ఓవైపు విషాదంలోనూ.. ఇంటివద్ద నుంచే.. ఉప ఎన్నికకోసం పనిచేశారని కొనియాడారు. ఎమ్మెల్సీ రవీందర్‌రావు తన సోదరుడు చనిపోయిన తర్వాత కూడా ఒకే రోజులోనే పార్టీ ప్రచారంలో పాల్గొన్నారన్నారు. వీరిద్దరే కాదు.. పార్టీకి చెందిన పలువురు తమ ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా ఉప ఎన్నిక కోసం 40 రోజులు కష్టపడ్డారని కేటీఆర్‌ వెల్లడించారు. రాజకీయ అనుభవం లేకపోయినా, ఈ ఎన్నికలో గెలుపుకోసం.. మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తెలియజేస్తున్నామన్నారు.రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను, అవినీతిని ఎండగడుతున్న సోషల్‌ మీడియా వారియర్లు, పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ నిజాయితీగా, చిత్తశుద్ధితో పోరాడిందని.. దొంగ ఓటరు కార్డుల పంపిణీ, అక్రమాల గురించి ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశామని తెలిపారు. ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌ ఎలా గెలిచింది..? ఆ పార్టీ వ్యవహారించిన తీరు, ఎన్నికల సంఘం, పోలీసుల పనితీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ కొనసాగాలని, మీడియాలోనూ చర్చ జరగాలని ఆయన అన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 04:50 AM