Share News

Minister Ponguleti: కమీషన్లు రావనే బీఆర్‌ఎస్‌ హయాంలో ఇళ్లు కట్టలేదు

ABN , Publish Date - Sep 28 , 2025 | 02:19 AM

కమీషన్లు రావనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వలేదని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి..

Minister Ponguleti: కమీషన్లు రావనే బీఆర్‌ఎస్‌ హయాంలో ఇళ్లు కట్టలేదు

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా.. మా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది : మంత్రి పొంగులేటి

సికింద్రాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కమీషన్లు రావనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వలేదని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. భారీగా కమీషన్లు దండుకోవచ్చనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పదేళ్లలో ఏడాదికి లక్ష ఇళ్లు నిర్మించి ఇచ్చినా, ఈ పాటికి పది లక్షల ఇళ్లు పేదలకు దక్కేవని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత భాగా లేకపోయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని చెప్పారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని రసూల్‌పురా జోపిడి సంఘంలో రూ.22.32 కోట్లతో 5 బ్లాక్‌లుగా నిర్మించిన 288డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్‌, మంత్రి పొంగులేటి శనివారం ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూఅర్బన్‌ ప్రాంతాల్లో పెండింగులో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేస్తామని తెలిపారు. సొంత స్థలాలు కలిగిన వారికి ఇళ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెబుతుందన్నారు. హైదరాబాద్‌ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ రసూల్‌పురాలో గతంలో ప్రారంభించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిధుల కొరతతో పెండింగ్‌లో ఉండగా, తమ ప్రభుత్వం నిధులు కేటాయించి, ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని వెల్లడించారు. ప్రజలు ఎంతో ఆశగా ఇళ్ల కోసం ఎదురు చూసినా కూడా బీఆర్‌ఎస్‌ హయాంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేశామని, ప్రస్తుతం గృహప్రవేశాలు సైతం జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణం ఎలా చేపట్టాలనే విషయమై ముఖ్యమంత్రితో, మంత్రి పొంగులేటితో కలిసి తాను చర్చిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో ఎంపీ ఈటల మాట్లాడి కంటోన్మెంట్‌ స్థలాలు కేటాయిస్తే వేలాది మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లతోపాటు కొత్తగా తాము రేషన్‌ కార్డులు ఇస్తున్నామని చెప్పారు.

Updated Date - Sep 28 , 2025 | 02:19 AM