BRS Condemns Speaker’s Verdict on Disqualified: స్పీకర్ తీర్పును ఖండిస్తున్నాం
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:56 AM
పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్.. ఫొటోలకు పోజులిచ్చేందుకే రాహుల్ చేతిలో రాజ్యాంగం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధం: హరీశ్
హైకోర్టుకెళ్తాం: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే: బీజేపీ
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు.. చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి ఏ మాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి నేటి స్పీకర్ నిర్ణయం వరకూ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు సాక్షాత్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేక సార్లు ప్రకటించినా వారిని కాపాడడం రాహుల్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని చెప్పారు. ఫొటోలకు పోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని.. తండ్రి చేసిన చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ చరిత్రలో మిగిలిపోతారని ధ్వజమెత్తారు. గోడ దూకిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాంగ్రెస్ కాపాడినా.. ఆయా నియోజకవర్గాల ప్రజలు వారిని ఎప్పుడో అనర్హులుగా ప్రకటించారని తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ‘రాజ్యాంగాన్ని కాపాడాలి’ అన్న రాహుల్ గాంధీ నినాదం ఉత్తుత్తిదేనని స్పీకర్ ఇచ్చిన తీర్పుతో తేటతెల్లమైందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం రేవంత్‌రెడ్డి సర్కారు రాజ్యాంగ వ్యవస్థలను దిగజార్చుతోందన్నారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై రాహుల్ ఉపన్యాసాలిస్తుంటే.. తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని నిర్లజ్జగా ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ తీర్పుపై బీఆర్‌ఎస్ పక్షాన హైకోర్టును ఆశ్రయిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, సంజయ్ చెప్పారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగానే స్పీకర్ ప్రసాద్‌కుమార్ తీర్పు ఇచ్చినట్లుగా ఉందన్నారు. ఎమ్మెలేలు పార్టీ మారితే ఏమీ కాదని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, ఆయన మాటలను ఇప్పుడు స్పీకర్ తన తీర్పులో చెప్పారన్నారు. ఏ సందర్భంగా పిటిషన్‌ను కొట్టివేశారో చెప్పాలని, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతారని నిలదీశారు.
రాజ్యాంగ విరుద్ధం: బీజేపీ
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడతామని మాట్లాడుతున్న పార్టీయే రాజ్యాంగ వ్యవస్థ అయిన స్పీకర్‌ను ప్రభావితం చేసి, సరైన నిర్ణయం తీసుకోకుండా చేసిందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంగా అభివర్ణించారు. స్పీకర్ మీద కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి తీర్పు ఇప్పించిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ స్పీకర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం సరికాదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మూడు నెలల్లో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. దాదాపు తొమ్మిది నెలలు కాలయాపన చేశారని విమర్శించారు. ఎమ్మెల్యేలు కడియం, దానం విషయంలో తీర్పు ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో సమాధానంచెప్పాలని డిమాండ్ చేశారు.