Former Minister Harish Rao: ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతుంటే.. వలస కార్మికులను బీఆర్‌ఎస్ ఆదుకుంది
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:41 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర పోతుంటే బీఆర్‌ఎస్ పార్టీ వలస కార్మికులను ఆదుకుంది. ఉపాధి కోసం జోర్డాన్ దేశానికి వెళ్లి..
ఎట్టకేలకు 12 మంది వలస కార్మికులు సొంతూళ్లకు చేరుకున్నారు: హరీశ్ రావు
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర పోతుంటే బీఆర్‌ఎస్ పార్టీ వలస కార్మికులను ఆదుకుంది. ఉపాధి కోసం జోర్డాన్ దేశానికి వెళ్లి.. అక్కడ చిక్కుకుపోయిన 12 మంది వలస కార్మికులను స్వదేశానికి తీసుకొచ్చి.. వాళ్ల సొంత ప్రాంతాలకు పంపించాం’’ అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, వాళ్లకోసం ప్రత్యేక పాలసీ తెస్తామని ఎన్నో చెప్పారని, కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని శనివారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. ‘తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ బిడ్డలను తీసుకురావడానికి ప్రత్యేకమైన ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ వలస కార్మికులకు బాసటగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. శనివారం తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్న జోర్డాన్ వలస కార్మికులు హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జోర్డాన్‌లో అనేక కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా ఎంతో కృషి చేసిన బీఆర్‌ఎస్ పార్టీకి, హరీశ్‌కు రుణపడి ఉంటామన్నారు. తాము తిరిగి తెలంగాణకు వచ్చేందుకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లినప్పటికీ ఎవరూ స్పందించలేదన్నారు.