Share News

BRS Approaches: స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Nov 11 , 2025 | 02:25 AM

తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.....

BRS Approaches: స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోండి

  • ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కావాలనే తాత్సారం చేస్తున్నారు.. 100 రోజులైనా చర్యల్లేవు

  • సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేస్తున్నారు

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్‌

  • పది మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ రిట్‌ పిటిషన్‌

  • అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ

  • నేను రిటైరైతే కోర్టు బంద్‌ కాదు కదా?: సీజేఐ

న్యూఢిల్లీ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్‌ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని, ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో జూలై 31న సీజేఐ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను స్పీకర్‌ కార్యాలయం అమలు చేయలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌, కల్వకుంట్ల సంజయ్‌, చింతా ప్రభాకర్‌ సహా ఇతరులు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో జాప్యం చేసినందుకు స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ దానం నాగేందర్‌, కడియం శ్రీహరి విషయంలోనూ ఒక్క అడుగు ముందుకు వేయలేదని తెలిపారు. 100 రోజులు గడిచినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవడం సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేయడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, స్పీకర్‌ కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు ఆ పదిమంది ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టే అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల కోర్టు ధిక్కరణ, రిట్‌ పిటిషన్ల గురించి మోహిత్‌రావు సోమవారం సీజేఐ ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ పిటిషన్లపై అత్యవసరంగా విచారణ జరపాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ‘సాధ్యమైనంత త్వరగా లేక మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఎమ్మెల్యేలు విచారణను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని, తీవ్రంగా పరిగణించాలని స్పీకర్‌కు సూచించింది. కానీ, ఈ వ్యవహారంలో స్పీకర్‌ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ పది మంది ఇప్పటికీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూనే ఉన్నారు. ఫిరాయింపు అంశంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్‌, కడియం శ్రీహరిల విషయంలోనూ స్పీకర్‌ స్పందించలేదు. ఇది ఉద్దేశపూర్వంగా చేస్తున్న ఆలస్యమే’ అని మోహిత్‌రావు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.


సుప్రీంకోర్టేమీ బంద్‌ కాదు కదా?

సీజేఐ ఈ నెల 24న పదవీ విరమణ చేస్తున్నందున అప్పటి వరకు ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం విచారణకు రాకుండా ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని మోహిత్‌రావు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా, సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘నేను రిటైర్డ్‌ అయితే ఏంటి? ఈ నెల 24 తర్వాత సుప్రీంకోర్టేమీ బంద్‌ కాదు కదా?’ అని జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. అత్యవసర విచారణకు నిరాకరించారు. రెండు పిటిషన్లపై వచ్చేవారం విచారణ చేపడతామని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై విచారణకు మరో 8 వారాల సమయం ఇవ్వాలని స్పీకర్‌ కార్యాలయం సుప్రీంకోర్టును కోరింది. ‘నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరో నలుగురి విచారణ చివరి దశకు చేరింది. ఇద్దరి విచారణ ప్రారంభమైంది. అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనలు.. వంటి కార్యక్రమాలతో స్పీకర్‌ తీరిక లేకుండా ఉన్నందున సుప్రీంకోర్టు విధించిన గడువులోగా విచారించడం సాధ్యం కాలేదు. ఎమ్మెల్యేలు సైతం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, అకాల వర్షాలు తదితర కారణాలతో నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వస్తోంది. స్పీకర్‌ షెడ్యూల్‌, ఎమ్మెల్యేల కార్యక్రమాల నేపథ్యంలో సమయం సరిపోలేదు’ అని స్పీకర్‌ కార్యాలయం అక్టోబరు 31న అప్లికేషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరగనుంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన రెండు పిటిషన్లపైనా అదే రోజు విచారణ జరిగే అవకాశం ఉంది.

Updated Date - Nov 11 , 2025 | 02:25 AM