Share News

Land Scam: 2 వేల కోట్లభూదందా!

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:10 AM

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా కొన్ని ఫైళ్లు ఆగవు. గత ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలకు నయా జమానాలోనూ స్పీడ్‌ బ్రేకర్లు ఉండవు. ఓ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ......

Land Scam: 2 వేల కోట్లభూదందా!

  • సీలింగ్‌ భూమిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భారీ కుంభకోణం

  • ఓఆర్‌ఆర్‌ పొడవునా వంద ఎకరాలు సొంతం

  • దుండిగల్‌, గౌడవల్లి మధ్య విల్లాలకు రంగం సిద్ధం

  • 40 ఎకరాలు ప్రభుత్వ భూమి.. 60 ఎకరాలు సీలింగ్‌

  • గత ప్రభుత్వంలో మొదలు.. ఈ సర్కారులో సహకారం

  • 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అనుమతి

  • సుమోటోగా అనుకూల నిర్ణయం తీసుకున్న సీసీఎల్‌ఏ

  • ఫెమాను ఉల్లంఘించినాఖాతరు చేయని రెవెన్యూ

  • రెండు వారాల్లో నాలా.. నాలుగు వారాల్లో రిజిస్ట్రేషన్లు

  • ఎమ్మెల్యే కుమారుడి కంపెనీ కోసం చట్టాలు గాలికి

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా కొన్ని ఫైళ్లు ఆగవు. గత ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలకు నయా జమానాలోనూ స్పీడ్‌ బ్రేకర్లు ఉండవు. ఓ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ విషయంలో ఇదే జరిగింది. ఈ కంపెనీకి గత ప్రభుత్వం ఏకంగా రూ.2,000 కోట్ల విలువైన భూవ్యవహారాన్ని దాదాపు సెటిల్‌ చేసింది. ఎంత వేగంగా అంటే 2023 మార్చిలో ఫైలును కదిపితే.. నవంబరు నాటికి కొలిక్కి వచ్చేసింది. ఇంతలో ప్రభుత్వం మారింది. అధికారం చేపట్టిన కాంగ్రెస్‌.. ఇందులో భారీ కుంభకోణం దాగి ఉందని గ్రహించి.. ఆ వివాదాస్పద భూములకు రిజిస్ట్రేషన్‌ చేయరాదని ఆదేశించింది. కానీ, భారీగా నగదు చేతులు మారడంతో కొంతకాలంలోనే ఆ ఫైలు మళ్లీ కదిలింది. అది కూడా సుమోటోగా. అంటే ఒక ఉన్నతాధికారి స్వయంగా ఆ కేసు తీసుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ నుంచి జిల్లా కలెక్టర్‌కు, అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ల శాఖకు ఆగమేఘాల మీద ఉత్తర్వులు వెళ్లిపోయాయి. గతంలో రిజిస్ట్రేషన్లు చేయొద్దని చెప్పిన భూమినే రిజిస్ట్రేషన్లు చేసెయ్యండంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో అనేక లొసుగులున్నా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రెండున్నర నెలల క్రితం రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. హైదరాబాద్‌ వ్యాప్తంగా విల్లాలు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్‌ కాంప్లెక్సులు కడుతున్న ఆ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు దుండిగల్‌, గౌడవల్లి మధ్య ఓఆర్‌ఆర్‌ పొడవునా విల్లాల నిర్మాణానికి మార్గం సుగమమైంది.


పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా..

ఎప్పుడో 1975 నాటి ల్యాండ్‌ సీలింగ్‌ కేసును గత ప్రభుత్వం తలకెత్తుకోవడమే అనుమానాస్పదంగా ఉంటే.. దానిని ఈ ప్రభుత్వంలోనూ పరుగులు పెట్టిస్తూ సెటిల్‌ చేయడం చర్చనీయాంశమైంది. ఇందులో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)ను ఉల్లంఘించి మరీ ఆ భూమిని విదేశీయులకు రిజిస్ట్రేషన్‌ చేశారు. తర్వాత హైదరాబాద్‌లోని ఓ కీలక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కుమారుడు డైరక్టర్‌గా ఉన్న కంపెనీకి (ప్రస్తుతం కంపెనీ డైరెక్టర్‌గా ఆయన లేరు) డెవల్‌పమెంట్‌కు ఇచ్చేశారు. ఇది రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌ అయింది. సీలింగ్‌ చిక్కుల్లో ఉన్నపుడు ఆ భూమి విలువ వేరు. ఆ చిక్కులు వీడగా ఎకరం కనీసం రూ.20కోట్లు ఉండే ఈ భూమి విలువ మొత్తం రూ.2,000కోట్ల పైనే ఉంటుందని అంచనా. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్‌ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 322 నుంచి 426 వరకు ఉన్న సుమారు 184 ఎకరాల భూముల వ్యవహారంలో ఫైళ్లు ఆగమేఘాల మీద పరుగులు తీశాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో చివరి ఏడాది 2023 మార్చి 1న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మేడ్చల్‌ కలెక్టర్‌కు ఒక మెమో (నంబరు489/ఏఎ్‌సఎ్‌సఎన్‌.4/ఏ1/2020-2) ఇచ్చారు. సీలింగ్‌ చట్టం కింద మూతపడిన కేసు(నంబరు ఎల్‌ఆర్‌ఏ 105/1996)ను సెక్షన్‌ 9 ప్రకారం తిరిగి తెరవాలని కోరారు. ఫైల్‌ ఓపెన్‌ చేయించిన కలెక్టర్‌ 25 రోజుల్లోనే ఆర్డీవో ద్వారా ఆర్డర్‌(ఎల్‌ఆర్‌టీ-ఆర్డీవో, మల్కాజ్‌గిరి, ఏవోఎల్‌ఆర్‌/416/1975,తేదీ:25-3-2023)పాస్‌ చేశారు. ఈలోగా ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం వచ్చాక 22ఏలో ఉన్న సదరు భూములను డీనోటిఫై చేసి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. దాంతో ఆ భూము ల్లోని 184.28 ఎకరాలను థామస్‌ మార్క్‌ సెక్వేరా, లిన్నెత్‌ సెక్వేరా(అమెరికా పౌరులు), మరికొందరి పేరిట రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేశారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే ఎమ్మెల్యే తనయుడి సంస్థ ఆ వ్యక్తులతో ఒప్పందం చేసుకొని వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడటానికి నాలా తీసుకుంది.


ఫెమా చట్టం ఉల్లంఘన..

ఫెమా చట్టం ప్రకారం విదేశీయులు దేశంలో వ్యవసాయ భూములు కొనుగోలు చేయలేరు. కానీ దుండిగల్‌లో ఆమెరికా పౌరులకు వ్యవసాయ భూములపై హక్కులు కట్టబెట్టారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం 1999 సెక్షన్‌ 6(3)ను ఫెమా 21/2000-ఆర్‌బీ, తేదీ:3.5.2000 నోటిఫికేషన్‌తో కలిపి అన్వయిస్తే ఉల్లంఘన స్పష్టమవుతోంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సీసీఎల్‌ఏ అధికారులు సుమోటోగా కేసును స్వీకరించి, వారికే వెన్నుదన్నుగా నిలిచారు. వివాదాస్పదమైన ఈ భూములను రిజిస్ట్రేషన్‌ చేయొద్దని మేడ్చల్‌ కలెక్టర్‌ 2024 డిసెంబరు 3న రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి లేఖ రాశారు. లేఖ నంబరు ఏవోఎల్‌ఆర్‌/416/1975 ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. తర్వాత కొందరు ప్రభుత్వ పెద్దల జోక్యంతో సీసీఎల్‌ఏ ఆదేశాలు ఇవ్వడం, వాటిపై ఏజీపీ నుంచి న్యాయ సలహా తీసుకోవడం, నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేయడం చకచకా జరిగిపోయాయి. సీసీఎల్‌ఏ ఆదేశాలను ప్రస్తావిస్తూ మేడ్చల్‌ కలెక్టర్‌ రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని 2025 సెప్టెంబరు 26న రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి మరోసారి లేఖ (లెటర్‌ నంబరు ఏఓఎల్‌ఆర్‌/416/1975, తేదీ:26-9-2025)రాశారు. ఆ తర్వాత చకచకా రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి.

సుమోటో అవసరం ఏంటో?

భూ సమస్యల మీద సీసీఎల్‌ఏ కార్యాలయం మెట్లు ఎక్కే ప్రజలను అధికారులు నెలల తరబడి తిప్పుకొంటారు. కానీ ఎమ్మెల్యే తనయుడి సంస్థ ప్రయోజనాలను కాపాడేందుకు మాత్రం ఏకంగా సుమోటోగా కేసును స్వీకరించడం, రియల్టర్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫెమా చట్టం కింద ఉల్లంఘన జరిగిందని తెలిసినా..2025 మార్చి29న ఇచ్చిన సుమోటో ఉత్తర్వుల్లో (ప్రొసీడింగ్‌ నంబరు ఆర్‌వోఆర్‌/2686637/2024: తేదీ:29-3-2025) లిన్నెత్‌ సెక్వేరా, థామస్‌ మార్క్‌, మరికొందరి పేర్లను ప్రస్తావిస్తూ తీర్పు ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేపడితే ఈ భూదందాకు సహకరించిన అధికారులతో పాటు, లబ్ధి పొందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ, దాని వెనక ఉన్నవారి బండారమంతా బయటపడే అవకాశం ఉంది.


40 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా

రియల్టర్‌ చూపించిన సర్వే నంబర్లలో ఎంత భూమి ఉంటే.. అదే భూమికి రెవెన్యూ అధికారులు మార్కింగ్‌ చేయాలి. కానీ, దుండిగల్‌ భూ దందాలో అధికారులు రియల్టర్‌ కోరుకున్న దాని కంటే ఎక్కువ మేలు చేశారనే ఆరోపణలున్నాయి. ఒక సర్వే నంబరులో వారు కోరుకున్న బిట్‌కు పక్కనే గుట్టలు, పుట్టలు, వినియోగానికి వీలుకాని భూములు ఉంటే అవన్నీ పక్కకు జరిపి రియల్టర్‌ విల్లాల నిర్మాణానికి ఇబ్బంది లేకుండా సమీపంలోని ప్రభుత్వ భూమిని కలిపి వెంచర్‌ వేసుకునేలా సహకరించారనే విమర్శలున్నాయి. మరోవైపు ఇక్కడ ఇంకో భారీ కుంభకోణం కూడా జరిగింది. ఈ సర్వే నెంబర్లలోని మొత్తం భూమి 184 ఎకరాలు. అందులో సదరు సీలింగ్‌ మిగులు భూమిగా క్లెయిమ్‌ చేసిన 102 ఎకరాలు పోను ప్రభుత్వానికి 82 ఎకరాలు ఉండాలి. వాస్తవానికి అక్కడ 40 ఎకరాలు కూడా లేదని అధికారులే చెబుతున్నారు. గతంలో ఓఆర్‌ఆర్‌ నిర్మాణం కోసం ఇదే భూమిలో కొంతభాగం కేటాయించారు. ఆ భూమిని అటూ సీలింగ్‌ మిగులు భూములుగా క్లెయిమ్‌ చేస్తున్న వారికి, ఇటు రియల్టర్‌ భాగం భూములకూ వర్తింపజేయాలి. అలా చేయకుండా ప్రభుత్వానికే మొత్తంగా సున్నం పెట్టేశారు. దీంతో అక్కడ రికార్డుల్లో ప్రభుత్వ భూమి 82 ఎకరాలుగా ఉన్నా.. వాస్తవంగా ఉన్నది 40 ఎకరాలేనని అధికారులే లోపాయికారీగా చెబుతున్నారు.

Updated Date - Dec 12 , 2025 | 05:11 AM