Share News

Kadari Satyanarayana Reddy: చివరిచూపైనా దక్కాలని

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:18 AM

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో అబూజ్‌మడ్‌ వద్ద సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సీపీఐ ఎంఎల్‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు...

Kadari Satyanarayana Reddy: చివరిచూపైనా దక్కాలని

  • కడారి సత్యనారాయణరెడ్డి మృతదేహం కోసం అబూజ్‌మడ్‌కు సోదరుడు కరుణాకర్‌ రెడ్డి

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో అబూజ్‌మడ్‌ వద్ద సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సీపీఐ ఎంఎల్‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్‌ కోసా దాదా మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఆయన సోదరుడు రిటైర్డ్‌ ఎంఈవో కడారి కరుణాకర్‌రెడ్డి కరీంనగర్‌ నుంచి అబూజ్‌మడ్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. 45 ఏళ్ల క్రితం కుటుంబసభ్యులను వదిలి అడవిబాటపట్టిన తన సోదరుడి చివరిచూపు కోసం పరితపిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటిదాకా పోలీసులు తమకు సమాచారం ఇవ్వలేదని, తన తమ్ముడి మృతదేహాన్ని అయినా అప్పగించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.... బసంత్‌నగర్‌లోని కేశోరామ్‌ సిమెంట్‌ ఫాక్టరీలో అప్రెటి్‌పషిప్‌ చేస్తున్న సమయంలో అక్కడి నుంచే అడవి బాటపట్టిన తన తమ్ముడు ఇంతవరకు తిరిగి రాలేదని, తను 45 ఏళ్లుగా ఎలా ఉన్నాడనే విషయం కూడా తెలియదని ఆయన వివరించారు. 1980 ఉగాది పండుగను గోపాల్‌రావుపల్లిలో తాను, సోదరుడు కలిసి కుటుంబసభ్యులతో జరుపుకొన్నామని, మరుసటి రోజున కేశోరామ్‌ సిమెంట్‌ ఫాక్టరీలో ఉద్యోగానికి సత్యనారాయణరెడ్డి వెళ్లిపోయాడని చెప్పారు. తర్వాత నెల రోజులకు ఇంటికి పోలీసులొచ్చి సత్యనారాయణ రెడ్డిపై హత్య కేసు నమోదైందని, ఆయన అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లాడని చెప్పారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన తమ్ముడి గురించి సమాచారం లేదని, పత్రికల్లో వార్తలను చూడటం తప్ప ఏమీ తెలియదని వాపోయారు.

Updated Date - Sep 24 , 2025 | 03:18 AM