Share News

BRK Leader Shobha: కొద్ది రోజులు నిదానంగా ఉండు అన్నీ సర్దుకుంటాయి

ABN , Publish Date - Sep 12 , 2025 | 04:31 AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సతీమణి శోభ.. ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లారు. బుధవారం రాత్రి జరిగిన అల్లుడు అనిల్‌..

BRK Leader Shobha: కొద్ది రోజులు నిదానంగా ఉండు అన్నీ సర్దుకుంటాయి

  • ఎమ్మెల్సీ కవితకు తల్లి శోభ సూచన

  • కూతురి ఇంటికి వెళ్లిన కేసీఆర్‌ సతీమణి

  • అల్లుడి బర్త్‌డే కార్యక్రమానికి హాజరు

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సతీమణి శోభ.. ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లారు. బుధవారం రాత్రి జరిగిన అల్లుడు అనిల్‌ పుట్టిన రోజు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభ.. కవితకు ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేసినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజులు నిదానంగా ఉండాలని, అన్నీ సర్దుకుంటాయని చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, సంతోశ్‌ అవినీతి అనకొండలని.. వారి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని పది రోజుల క్రితం కవిత చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. పర్యవసానంగా ఆమె పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. తదనంతరం కేసీఆర్‌తో కేటీఆర్‌, హరీశ్‌ పలుమార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కవిత నివాసానికి ఆమె తల్లి వెళ్లడం ఆసక్తిని రేపింది.

5న మనవడి బర్త్‌డేకు అమ్మమ్మ దూరం..

ఈ నెల 5న జరిగిన కవిత కుమారుడి బర్త్‌ డే కార్యక్రమానికి శోభ హాజరుకాలేదని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. ‘కవిత కుమారుడి బర్త్‌డే సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి శోభతో పాటు కుటుంబసభ్యులంతా హాజరవుతారు. అయితే ఈసారి అలా జరగలేదు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ఈ నెల 2న కవితను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో, తనకుమారుడి బర్త్‌డే కార్యక్రమానికి రావాలని కవిత ఆహ్వానించినా.. ఆమె తల్లి రాలేదు. అయితే, కొత్త బట్టలు, పూజా సామగ్రి పంపించారు’ అని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Sep 12 , 2025 | 08:46 AM