kumaram bheem asifabad- పంటలకు ఊపిరి
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:02 PM
జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోశాయి. గత నెలలో కురిసిన అడపాదడపా వర్షాలకు జిల్లాలో పత్తి, కంది, సోయా ఇతర పంటలు సాగు చేశారు. కానీ వరి నాట్లు చాలా మంది రైతులు వేయలేదు. వర్షాలు గత నెలలో చాలా తక్కువ వర్షపాతం నమోదవడం, పంటలకు అనుకూలంగా లేక పోవడంతో రైతులు దిక్కులు చూశారు.
- పత్తి, ఇతర పంటలకు ప్రయోజనం
- వరినాట్లకు సన్నద్ధమవుతున్న రైతులు
చింతలమానేపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోశాయి. గత నెలలో కురిసిన అడపాదడపా వర్షాలకు జిల్లాలో పత్తి, కంది, సోయా ఇతర పంటలు సాగు చేశారు. కానీ వరి నాట్లు చాలా మంది రైతులు వేయలేదు. వర్షాలు గత నెలలో చాలా తక్కువ వర్షపాతం నమోదవడం, పంటలకు అనుకూలంగా లేక పోవడంతో రైతులు దిక్కులు చూశారు. కానీ ఈ వర్షంతో రైతులకు ఊరట లభించడంతో వరి నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉందని రైతులు సంబరపడుతున్నారు. దీంతో రైతాంగం బిజీ..బిజీగా గడుపనున్నారు.
- 4.5 లక్షల ఎకరాల్లో పంటలు..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో వ్యాప్తంగా 1.23 లక్షల మంది రైతులు ఉండగా 4.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అందులో మెజార్టీ రైతులు పత్తి పంట సాగు చేస్తుండగా 3,35,363ఎకరాల్లో సాగవుతోంది. వరి 56,861 ఎకరాల్లో సాగవుతోంది. కంది 30,430 ఎకరాలు, మొక్కజొన్న 1000, ఇతర పంటలు 1500 ఎకరాల్లో సాగవు తున్నాయి. వర్షాల ఆశించిన స్థాయిలో కురవడంతో పంటలో ఎరువులు వేయడం, మందు లు పిచికారి చేయడం, గడ్డి తొలగించడం వంటి పనులు చేయడానికి పనుల్లో నిమగ్న మయ్యేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరి నాట్లు వేసుకోవడానికి సైతం రైతులు నారు మడులు సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేపడుతున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతమే నమోదైంది. బెజ్జూరు, రెబ్బెన, వాంకిడి, కాగజ్‌నగర్, చింతలమానేపల్లి మండలాల్లో సాధరణం కంటే ఎక్కువగా కురిసింది. మిగిలా మండలాల్లో సాధరణం కంటే తక్కువగానే ఉంది. వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి పెద్దగా భారీ వర్షం కురిసిన దఖాలాలు లేవు.
- పలు మండలాల్లో..
జిల్లాలోని పలు మండలాల్లో వరి నాట్లు మొదలయ్యాయి. చింతలమానేపల్లి, దహెగాం, సిర్పూర్, బెజ్జూరు, కౌటాల. పెంచకలపేట మండలాల్లో వరి నాట్లు షూరు అయ్యాయి. కొందరు బోర్లతో పాటు వర్షంనీటితో పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో తిర్యాణిలో చెలిమలవాగు, డోల్పులవాగు, గుండాలలోని చెరువుల కింద మొలక అలుకుతున్నారు. ఆసిఫాబాద్, రెబ్బన మండలాల్లోని వట్టివాగు ఆయకట్టుదారులు నాట్లు వేసేందుకు పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా మెట్ట పంటకు ఈ వర్షంతో అవసరమైన ఎరువులు వేయాలని ఇతర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా పంటల్లో కలుపు లేకుండా చూడడం, సమయానికి ఎరువులు వేయడం, తెగుళ్లు సోకకుండా తెగుళ్ల నివారణ కోసం మందులు స్ర్పే చేయడం వంటి పనులతో పాటు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నారు.
ఆశించిన స్థాయిలో వర్షాలు..
- పోశయ్య, రైతు
జిల్లాలో నాలుగు రోజులుగా ఆశించిన వర్షాలు కురుస్తున్నాయి. మెట్ట పంటల పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వరినాట్లు వేసేందుకు రైతులు పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. పది రోజుల క్రితం వరకు భారీ వర్షాలు లేక పోవడంతో పొలాలు దున్నడం లాంటి పనులు చేయలేదు. పత్తి పంటలో ఇప్పటికే గడ్డి తొలగించడం, మందులు స్ర్పే చేయడం వంటి పనులు చేపట్టాం. ఇప్పటికైతే అనుకూల వాతావరణం ఉంది.