Branded Liquor in Panchayat Elections: బ్రాండ్‌కు తగ్గేదేలే!
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:23 AM
పంచాయతీ ఎన్నికల వేళ బ్రాండెడ్ మద్యానికి తగ్గేదేలేదని ఓటర్లు సర్పంచ్ అభ్యర్థులకు తేల్చి చెబుతున్నారు. చీప్ లిక్కర్ తాగేవారు కూడా మీడియం రేంజ్ మద్యం....
పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో బ్రాండెడ్ మద్యానికి గిరాకీ
గత ఎన్నికల్లో గోవా, కర్ణాటక నుంచి టెట్రా ప్యాకెట్‌ల సరఫరా
బ్రాండ్ మద్యంతో ఖర్చు ఎక్కువ అవుతుందంటున్న అభ్యర్థులు
ఎక్కువ ఖర్చు చికెన్, మందుకే.. రెండింతలు పెరిగిన మద్యం అమ్మకాలు
మహబూబ్‌నగర్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పంచాయతీ ఎన్నికల వేళ బ్రాండెడ్ మద్యానికి తగ్గేదేలేదని ఓటర్లు సర్పంచ్ అభ్యర్థులకు తేల్చి చెబుతున్నారు. చీప్ లిక్కర్ తాగేవారు కూడా మీడియం రేంజ్ మద్యం ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి వెంట నడిచే వారికి టిఫిన్లు, టీ, కాఫీలు, మధ్యాహ్నం తర్వాత నుంచి దావత్‌లు ఉండాల్సిందే. ఇంటికి కిలో చికెన్ చొప్పున కూడా అభ్యర్థులు ఆఫర్ చేస్తున్నారు. మొత్తం ఖర్చులో మద్యం, చికెన్‌కే ఎక్కువ ఖర్చవుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు అవతలి అభ్యర్థి కంటే టాప్ బ్రాండ్ మద్యం ఇవ్వాల్సి వస్తోందని అభ్యర్థులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా 90 ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు కొనుగోలు చేస్తారని ఐఎంల్ డిపోల్లో స్టాక్ చేస్తే వాటిని ఎవరూ తీసుకెళ్లడం లేదు. గతంలో ఓసీ, ఐబీ, ఎంసీడైట్ వంటి ప్రీమియం బ్రాండ్ల మాదిరిగా పంపిణీ చేసేవారు. కానీ, ఇప్పుడు ఓసీ ఎవరూ కొనుగోలు చేయడం లేదు. ఐబీ, ఎంసీడైట్, రాయల్ స్టాగ్, రాయల్ గ్రీన్, రాయల్ చాలెంజ్, బ్లెండర్స్ ప్రైడ్, సిగ్నేచర్ లాంటి బ్రాండ్ల మద్యం కొనుగోళ్లు మాత్రమే జరుగుతున్నాయి.
మద్యం డిపోల్లో సీలింగ్....
ఎక్సైజ్ పాలసీ గత నెలలో ముగిసి డిసెంబరు 1 నుంచి నూతన పాలసీ ప్రారంభమైన విషయం తెలిసిందే. లక్కీడి్‌పలో దుకాణాలు దక్కించుకున్న వారు ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే మీడియం రేంజ్ బ్రాండ్ల ఇండెంట్ బాగా కోరుతుండటంతో ఐఎంల్ డిపోల నుంచి సరఫరా కాని పరిస్థితి ఏర్పడింది. ఒక ట్రక్ వస్తే ఒక్కో దుకాణానికి 4 నుంచి 5 కాటన్ల మద్యం మాత్రమే ఇవ్వాలని సీలింగ్ పెట్టుకున్నారు. ఐబీ, ఎంసీడైట్, రాయల్‌స్టాగ్, రాయల్ ఛాలెంజ్, రాయల్ గ్రీన్, బ్లెండర్స్ ప్రైడ్, సిగ్నేచర్‌కు సంబంధించి ప్రస్తుతం సీలింగ్ విధించారు. ఒక్కో దుకాణానికి 5 కాటన్లను మించనివ్వడం లేదు. దీనికి తోడు దుకాణదారులు అడ్వాన్సులు కూడా చెల్లిస్తున్నారు. ఈ బ్రాండ్ల మద్యం కంపెనీకి ప్రభుత్వం నుంచి కొంత పేమెంట్ పెండింగ్‌లో ఉన్నందుకు ఆయా కంపెనీలు సరఫరా తక్కువ చేశాయనే అనిపిస్తోంది. అయితే గతంలో కంటే మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రెండు ఐఎంల్ డిపోలు ఉండగా సేల్స్ రెట్టింపు అయ్యాయి. సుమారు రెండింటిలో కలిపి ఒక్క లిక్కర్ మాత్రమే రోజుకు రూ.15 కోట్ల వరకు సరఫరా అవుతుంది. బీర్ కలుపుకుంటే రూ.22 కోట్ల వరకు ఉండొచ్చు. గతంలో ఇందులో సగం మాత్రమే ఒకరోజు అమ్మకాలు ఉండేవని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.