Family Tragedy: గాలిపటం కోసం బాలుడి ఆత్మహత్య
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:23 AM
గాలిపటం కొనివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండ లం చిల్వేర్ గ్రామంలో ఆదివారం జరిగింది.
అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదని అఘాయిత్యం
మిడ్జిల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గాలిపటం కొనివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండ లం చిల్వేర్ గ్రామంలో ఆదివారం జరిగింది. చిల్వేర్‌కు చెందిన జక్క రాజు, శ్రీలత దంపతుల కుమారుడు సిద్దు(9) స్థానిక పాఠశాలలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో గాలిపటం కొనివ్వాలని తల్లిదండ్రులను కోరగా వారు నిరాకరించారు. బాలుడు పదే పదే అడగడంతో తండ్రి రూ.20 ఇచ్చాడు. అయితే, తాను అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న సిద్దు, పత్తి కుప్పపైకి ఎక్కి, వెంటిలేటర్‌కు చీరను కట్టి ఉరివేసుకున్నాడు. ఎంతసేపటికీ బాలుడు బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, చుట్టు పక్కల వారి సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా.. అప్పటికే సిద్దు ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు ఆడ పిల్లల తర్వాత చాలా కాలానికి పుట్టిన కుమారుడు చిన్న కారణానికే ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయంపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు.