Share News

బౌన్సర్‌.. చెమటోడ్చాల్సిందే

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:43 AM

బౌన్సర్‌.. ప్రస్తుత సమాజంలో హోదాకు ఓ కొలమానం. జనసమూహంతో కూడిన ఏ కార్యక్రమమైనా వారుండాల్సిందే. ధ్రుడమైన శరీరాకృతితో ఉండే వారిని చూస్తే ఎవరికైనా వారు చెప్పినట్లు నడుచుకోవాలన్నట్లు ఉంటారు.

బౌన్సర్‌.. చెమటోడ్చాల్సిందే
కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్న బౌన్సర్లు

శుభకార్యాలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు, హోటళ్లు వద్ద విధులు

శరీరాకృతి కోసం నెలకు రూ.15వేల ఖర్చు

బౌన్సర్‌.. ప్రస్తుత సమాజంలో హోదాకు ఓ కొలమానం. జనసమూహంతో కూడిన ఏ కార్యక్రమమైనా వారుండాల్సిందే. ధ్రుడమైన శరీరాకృతితో ఉండే వారిని చూస్తే ఎవరికైనా వారు చెప్పినట్లు నడుచుకోవాలన్నట్లు ఉంటారు. వారిని ముందుంచి ఇప్పుడు ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు, పలుకుబడి కలిగిన వారి ఇళ్లలో పెళ్లిళ్లు, వారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. బౌన్సర్ల సంస్కృతి ఇప్పుడు మహానగరాల నుంచి జిల్లాలకు విస్తరించింది. ఉమ్మడి జిల్లాలో 150మంది వరకు గుర్తింపు పొందిన బౌన్సర్లు ఉన్నారు.

-ఆంధ్రజ్యోతి- సూర్యాపేట(కలెక్టరేట్‌)

ఇటీవల ఏదైనా కార్యక్రమం జరిగితే అక్కడ బౌన్సర్లు కనబడుతున్నారు. సమాజంలో కొంచెం పలుకుబడి, డబ్బున్న వారు వారి నివాసాల్లో, కంపెనీల్లో జరిగే కార్యక్రమాలకు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం కాగా ఇటీవల గ్రామీ ణ ప్రాంతాలు, పట్టణాలకు కూడా విస్తరించింది. కొంతమంది యువత ఆరోగ్యం కోసం ప్రారంభించిన వ్యాయామం చివరికి వారికి ఉపాధి అవకాశాలు చూపుతోంది. ప్రతి రోజూ జిమ్‌లకు వెళ్లి గంటల తరబడి వివిధ రకాల సాధనలుచేసి వారి శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు.

వయస్సు పెరిగితే అంతే..

బౌన్సర్లకు వయస్సు పెరిగితే ఉపాధి లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 35ఏళ్లు దాటితే బౌన్సర్లుగా ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదు. మహిళలకు సుమారు 20 ఏళ్ల నుంచి 30ఏళ్ల లోపు వారికే అవకాశాలు ఉంటాయి. పురుషుల విషయంలో కూడా బౌన్సర్లుగా పనిచేసిన రోజుల్లో మినహాయిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు కలు గుతున్నాయి. శరీరాకృతి కొనసాగించాలంటే ప్రతి రోజూ జిమ్‌లకు వెళ్లి వ్యాయామం చేయ డంతో పాటు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.

ఏడాదిలో 150 రోజులు మాత్రమే ఉపాధి

బౌన్సర్లకు ఏడాదిలో సుమారు 150రోజులు మాత్రమే ఉపాధి లభిస్తుంది. ఉపాధి లభించిన రోజు ఒక్కో బౌన్సర్‌కు రూ.2వేల నుంచి రూ.2500 వరకు వేతనం చెల్లిస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉంటున్నారు. ఎక్కడైనా ఏదైనా కంపెనీలో గానీ ఇతర కార్యాలయాల్లో పని చేద్దామంటే బౌన్సర్లను పనులకు పెట్టుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో బౌన్సర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో 150 మంది బౌన్సర్లు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 150మంది బౌన్సర్లు ఉన్నారు. 18ఏళ్లు పైబడిన వారి నుంచి 50ఏళ్ల వయస్సు గల వారు బౌన్సర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి, ఖ మ్మం, వరంగల్‌, దేవరకొండ పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లో బౌన్సర్లు పని చేస్తున్నారు. అవసరమైతే హైదరాబాద్‌లో కూడా పనిచేయడానికి వెళ్తున్నారు. బౌన్సర్ల కోసం ప్రభుత్వ అనుమతితో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. అనుమతి పొందిన ఏజెన్సీలు బౌన్సర్లను ఎంపిక చేసుకుని వారికి గుర్తింపుకార్డులు జారీ చేస్తున్నారు. ఏ కార్యక్రమ ంలోనైనా ఘర్షణ జరిగినప్పుడు ఆ ప్రభావం బౌన్సర్లపై పడుతుంది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట బౌన్సర్ల విధులపై చర్చనీయాంశమైంది. ఘర్షణలు జరిగినప్పుడు బౌన్సర్లపై అనేక దాడులు జరుగుతుంటాయి. వాటిని తట్టుకోవాల్సిన పరిస్థితి బౌన్సర్లపై ఉంది.

ఎక్కడైనా విధులు..

బౌన్సర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా విధులు నిర్వహిస్తుంటారు. శుభకార్యం, రాజకీయ, ఇతర సమావేశాలు, షాపింగ్‌ మాల్స్‌, కంపెనీల ప్రారంభోత్సవాలు, హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల వద్ద బౌన్సర్లు విధులు నిర్వహిస్తున్నారు. శుభకార్యాల్లో వేదికపైకి ఇష్టానుసారంగా అతిథులు వెళ్లకుండా వరుస క్రమంలో పంపిస్తూ సమయాన్ని వృథా కాకుండా కార్యక్రమం నిర్వహించుకునే వారిని అందరూ దీవించేలా విధులు నిర్వహిస్తుంటారు. అదే సమావేశాల విషయంలో వేదికపైకి అనుమతిలేని వారు వెళ్లకుండా, తోపులాట జరగకుండా నిరోధిస్తుంటారు. షాపింగ్‌ మాల్స్‌, వివిధ రకాల కంపెనీల ప్రారంభోత్సవాలకు సెలబ్రిటీలు, వీఐపీలు, రాజకీయ ప్రముఖులు హాజరవుతుంటారు. అలాంటి సందర్భాల్లో ఎలాంటి తోపులాట జరగకుండా కార్యక్రమం సాఫీగా జరిగేలా పనిచేస్తుంటారు. పెద్దపెద్ద స్టార్‌ హోటళ్లు, ఆస్పత్రులు, బార్‌ అండ్‌ రెస్టారెం ట్ల వద్ద కొంతమంది ఘర్షణ పడుతుంటారు. బౌన్సర్లను నియమించుకొని వారి ద్వారా ఘర్షణ పడేవారిని అడ్డుకుంటారు.

ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలి

బౌన్సర్లకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు చూపించాలి. ఏడాదిలో 150 రోజులు మాత్రమే ఉపాధి లభిస్తుంది. మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉంటున్నాం. ఏదైనా కంపెనీలు, కార్యాలయాల్లో బౌన్సర్లను పనులకు పెట్టుకోవడం లేదు. ప్రభుత్వం వివిధ కంపెనీల వద్ద ఏర్పాటు చేసే సెక్యూరిటీ ఉద్యోగాల్లో బౌన్సర్లకు అవకాశాలు కల్పించాలి. శరీరాకృతి కోసం నెలకు కనీసం రూ.15వేలు ఖర్చవుతోంది.

- భగవాన్‌, భగత్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌, నల్లగొండ.

Updated Date - Apr 11 , 2025 | 12:43 AM