Bottuguda School: బొట్టుగూడ పాఠశాలకు కోమటిరెడ్డి ప్రతీక్ పేరు
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:28 AM
నల్లగొండలో అత్యాధునిక వసతులతో నిర్మితమవుతున్న బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలకు.. కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలగా ప్రభుత్వం...
ప్రభుత్వ ఉత్తర్వులు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం
ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్ల వ్యయంతో నిర్మాణం
నల్లగొండ రూరల్, హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): నల్లగొండలో అత్యాధునిక వసతులతో నిర్మితమవుతున్న బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలకు.. కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలగా ప్రభుత్వం నామకరణం చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను మంగళవారం జారీ చేసింది. బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ పాఠశాల నూతన భవనానికి శ్రీకారం చుట్టారు. తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ పేరిట ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సుమారు రూ.8కోట్ల వ్యయంతో భవన నిర్మాణాన్ని చేపట్టారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉండేలా ఈ నూతన భవనంలో వసతులు కల్పిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కోమటిరెడ్డి ప్రతీక్ పేరును ఆ పాఠశాలకు ఖరారు చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. జీవో ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి, అందుకు కృషి చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఒకటి లేదా రెండు నెలల్లోపే పాఠశాలను సిద్ధం చేసి ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు కావాల్సిన అన్ని వసతులను పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నామని, ఆంగ్ల, ఉర్దూ మీడియంలో బోధనకు ఉపాధ్యాయులను కూడా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారానే నియమిస్తామని తెలిపారు. ఇక, వచ్చే మూడేళ్లలో నియోజకవర్గంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను దశలవారీగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.
పేగు సంబంఽధిత వ్యాధి బాధితుడికి.. 2.50 లక్షలు
పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తికి మంత్రి వెంకటరెడ్డి రూ.2.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. నల్లగొండ జిల్లా ఎల్లారెడ్డిగూడెంకు చెందిన పోకల శ్రావణ్‌కుమార్ కొంతకాలంగా పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాఽధపడుతున్నారు. చికిత్స కోసం సీఎం సహాయనిధి నుంచి అందించే లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్‌వోసీ)ద్వారా సాయం కోరారు. స్పందించిన మంత్రి చికిత్సకు అవసరమైన రూ.2.50 లక్షలను సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీ ద్వారా అందించారు. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.