Share News

Medical Education: సరిహద్దు జిల్లాల విద్యార్థులకు స్థానికత చిక్కు!

ABN , Publish Date - Oct 27 , 2025 | 02:04 AM

గద్వాల జిల్లా ఐజకు చెందిన ఆర్‌. కవిత... ఒకటి నుంచి పదో తరగతి వరకు స్థానికంగానే చదువుకున్నారు. పొరుగునే ఉన్న ఏపీలోని కర్నూలులో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు...

Medical Education: సరిహద్దు జిల్లాల విద్యార్థులకు స్థానికత చిక్కు!

  • ఒకటి నుంచి టెన్త్‌ దాకా రాష్ట్రంలోనే.. ఇంటర్మీడియట్‌ మాత్రం పొరుగు రాష్ట్రంలో

  • ఆ కారణంగా వైద్య విద్యలో సీటు మిస్‌

  • నీట్‌లో మంచి ర్యాంకు వచ్చినా నో యూజ్‌

  • ఇలాంటి దురదృష్టవంతులు 30 మంది

  • 8ఆదుకోవాలని సర్కారుకు వినతి

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లా ఐజకు చెందిన ఆర్‌. కవిత... ఒకటి నుంచి పదో తరగతి వరకు స్థానికంగానే చదువుకున్నారు. పొరుగునే ఉన్న ఏపీలోని కర్నూలులో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు. ఈ ఏడాది నీట్‌లో తనకు 360 మార్కులొచ్చాయి. ఎస్సీ కేటగిరిలో తనకు కన్వీనర్‌ కోటాలో కచ్చితంగా సీటు వస్తుందని అనుకున్నారామె. అయితే ఇంటర్‌ను వేరే రాష్ట్రంలో చదవడంతో ఆమె స్థానికురాలు కాకుండాపోయింది. కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రావూరి హర్షిత కూడా టెన్త్‌ వరకు సొంత ఊర్లోనే చదివారు. నీట్‌లో మంచి ర్యాంకు సాధించడం కోసం ఇంటర్మీడియట్‌ కోసం ఏపీలోని విజయవాడలో ఓ ప్రైవేటు కళాశాలలో చేరారు. నిరుడు ఆమె ఇంటర్‌ పూర్తి చేశారు. ఈ ఏడాది నీట్‌లో మంచి ర్యాంకు సాధించారు. ఆమెకూ కన్వీనర్‌కోటాలో సీటు వచ్చి ఉండేది. స్థానికంగా ఇంటర్మీడియట్‌ చేయలేదన్న ఒక్క కారణంతో ఆమెకు ఎంబీబీఎ్‌సలో సీటు దక్కలేదు.

ఆర్‌. కవిత, రావూరి హర్షిత మాదిరిగానే వైద్యవిద్యలో సీట్ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలోని ఏపీ సరిహద్దు జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు చెందిన ఎందరో విద్యార్థులకు ‘స్థానికత’ కష్టాలు తీవ్ర ఇబ్బందుల్లో పడేశాయి. రాష్ట్రంలోనే పుట్టి, రాష్ట్రంలోనే పెరిగి, రాష్ట్రంలోనే పదో క్లాసుదాకా చదువుకున్నా ఇంటర్‌ విద్యను మాత్రం బయట రాష్ట్రంలో చేశారన్న ఒకేఒక్క కారణంతో వారంతా స్థానికులు కాకుండాపోతున్నారు. సమీపంలో మెరుగైన విద్యా సౌకర్యాలు లేకపోవడంతో పొరుగు రాష్ట్రంలోని జిల్లాలకు వెళ్లి చదువుకోవడమే తమకు శాపంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ‘జీవో 33’తో వచ్చిపడిన చిక్కు! వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలకు అవకాశం కల్పించారు.


దాంతో ఏపీ విద్యార్థులు తెలంగాణలో, తెలంగాణ విద్యార్థులు ఏపీలో ప్రవేశాలు పొందడానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు జీవో నంబరు 114 తెచ్చింది. దీని ప్రకారం ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు వరుసగా ఏడేళ్లలో నాలుగేళ్లపాటు తెలంగాణలో చదవి ఉంటే స్థానికులే అవుతారు అయితే మెరుగైన విద్య కోసం హైదరాబాద్‌ కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో వరుసగా నాలుగేళ్ల పాటు చదివిన పొరుగు రాష్ట్రాల విద్యార్థులకు కూడా స్థానికత వరిస్తోందని, ఈ కారణంగా స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో కాంగ్రెస్‌ సర్కారు 2017లోని రూల్‌ 3 (ఏ)ను సవరిస్తూ 2024 జూలై 19న జీవో 33ని తీసుకొచ్చింది. దీనిప్రకారం ఇంటర్‌ వరకు వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివిన విద్యార్థులకే వైద్య విద్యా కోర్సుల్లో స్థానికత కోటా 85శాతం వర్తిస్తుంది. ఈ క్రమంలో టెన్త్‌ దాకా రాష్ట్రంలోనే చదివి.. మెరుగైన విద్య కోసం ఏపీలో చదివిన సరిహద్దు జిల్లాల విద్యార్థులకు ఈ 33 జీవో స్థానికతను గల్లంతు చేసింది. పాత జీవో 114 ప్రకారం తమకు ఇబ్బంది ఉండదనుకునే ఇంటర్‌ విద్యను పొరుగు రాష్ట్రాల్లో చదివించామని బాఽధిత విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటర్మీడియట్‌ అయ్యేలోగా కొత్త జీవో 33 రావడంతో శాశ్వతంగా స్థానికత వర్తించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడో విడత కౌన్సెలింగ్‌లోనైనా..

రెండు రోజుల క్రితం సరిహద్దు జిల్లాలకు చెందిన పలువురు నీట్‌ అభ్యర్ధులు సచివాలయంలోని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయానికి వచ్చారు. అక్కడ తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చినట్లుగా నీట్‌ అభ్యర్ధులు తెలిపారు. కన్వీనర్‌ కోటా మూడో విడత కౌన్సెలింగ్‌ ఇంకా జరగాల్సి ఉందని, ఇప్పటికైనా తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటే చివరి అవకాశమైనా దక్కుతుందని వారు చెబుతున్నారు. నీట్‌ రాసి, మంచి స్కోరు సాధించి, స్థానికులు కారన్న ఒక్క కారణంతో వైద్యవిద్య ప్రవేశాలకు దూరం కావాల్సివచ్చిందని సరిహద్దు ప్రాంతాలకు చెందిన 30 మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 27 , 2025 | 02:04 AM