Bomb Threats: రెండు న్యాయస్థానాలకు బాంబు బెదిరింపు
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:48 AM
రాష్ట్రంలోని రెండు కోర్టులకు గురువారం బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. వరంగల్- హనుమకొండ జిల్లా కోర్టుతో పాటు, హైదరాబాద్...
హనుమకొండతో పాటు, నాంపల్లి కోర్టులకు హెచ్చరికలు
వరంగల్ లీగల్, అఫ్జల్‌గంజ్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రెండు కోర్టులకు గురువారం బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. వరంగల్- హనుమకొండ జిల్లా కోర్టుతో పాటు, హైదరాబాద్ (నాంపల్లి)లోని సిటీ క్రిమినల్ కోర్టులకు ఈ బెదిరింపులు వచ్చాయి. న్యాయాధికారుల ఛాంబర్లలో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టినట్లు మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి ఒకరు హనుమకొండ జిల్లా జడ్జికి మెయిల్ పంపించారు. వెంటనే జిల్లా జడ్జి డాక్టర్ కె. పట్టాభి రామారావు సుబేదారి పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు డ్వాగ్‌స్క్వాడ్ సహాయంతో కోర్టు ప్రాంగణమంతా తనిఖీలు నిర్వహించారు. బాంబులు లేవని వారు నిర్థారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాంపల్లి సిటీ క్రిమినల్ కోర్టుకు కూడా ఉదయం ఇలాంటి ఈ-మెయిలే వచ్చింది. తాను పాక్ ప్రేరేపిత ఐఎ్‌సఐ ఉగ్రవాదినని, కోర్టులో బాంబులు పెట్టానని, సరిగ్గా మధ్యాహ్నాం 2 గంటలకు భారీ పేలుడు, తీవ్ర విధ్వంసం సంభవిస్తుందంటూ బెదిరించాడు. కోర్టు వర్గాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాయి. ఉదయం 11.30 గంటలకు నాంపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది వచ్చి కోర్టు లోపల, బయట ఆధునాతన పరికరాలతో అణువణువునా మధ్యాహ్నం రెండు గంటల వరకు తనిఖీలు చేశారు. ఇది ఉత్తుత్తి బాంబు బెదిరింపు అని తేల్చారు.