Srisailam Left Canal Tunnel: టైగర్ రిజర్వ్ అడ్డంకి లేనట్టే!
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:28 AM
పర్యావరణానికి, జంతుజాలానికి, టైగర్ రిజర్వ్ సమతుల్యతకు ఎలాంటి ఆటంకాలూ లేకుండానే శ్రీశైలం ఎడమగట్టు కాలువ...
న్యూ ఆస్ట్రెయిన్ విధానంలో తవ్వకం.. 4 మీటర్ల వరకే బ్లాస్టింగ్ వేవ్స్ పరిమితం
పని ప్రారంభించాకే ఆడిట్ ఏర్పాటుపై స్పష్టత
షీర్ జోన్ ఉంటే క్రాస్ సెక్షన్‌చేసుకొని టన్నెల్: నిపుణులు
వారంలో సర్వే పూర్తి..15 రోజుల్లో నివేదిక
మహబూబ్‌నగర్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పర్యావరణానికి, జంతుజాలానికి, టైగర్ రిజర్వ్ సమతుల్యతకు ఎలాంటి ఆటంకాలూ లేకుండానే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ను పూర్తిచేయవచ్చని ప్రభుత్వం నియమించిన నిపుణులు చెబుతున్నారు. రెండేళ్ల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తిచేయవచ్చని వారు పేర్కొంటున్నారు. ఈ టన్నెల్‌ను ప్రారంభించినప్పుడు టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) పద్ధతిలో చేపట్టిన సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి పనులు నిలిచిపోవడం, భూపొరల్లో వచ్చిన మార్పుల కారణంగా ఈ ఏడాది పనులు పునఃప్రారంభించిన సమయంలో టన్నెల్ కూలిపోయి ఎనిమిది మంది కార్మికులు చనిపోయారు. టీబీఎం కూడా పూర్తిగా ధ్వంసమైంది. మిగిలిన 9 కిలోమీటర్లనూ పూర్తిచేస్తే 3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు.. పైసా ఖర్చు లేకుండా 30 టీఎంసీల వరకూ నీటిని తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కానీ.. టీబీఎం పద్ధతిలో టన్నెల్ పూర్తిచేయడానికి వీలు లేదు కాబట్టి.. డీబీఎం (డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్) పద్ధతిలో చేయాలని నిర్ణయించింది. అయితే టన్నెల్ ఉన్న ప్రాంతం మొత్తం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండటం, భూ పొరల్లో మార్పుల వల్ల షీర్ జోన్లు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియకపోవడంతో.. దేశంలోనే తొలిసారి హెలీబార్న్ ఎలకో్ట్ర మ్యాగ్నెటిక్ విధానం ద్వారా మినరల్స్, షీర్ జోన్స్, వాటర్ బాడీస్ ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి సర్వే చేపట్టింది. సోమవారం నాగర్‌కర్నూలు జిల్లా మన్నెవారిపల్లి ఔట్‌లెట్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి సర్వేను పరిశీలించారు. సర్వే నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా టన్నెల్ నిర్మాణాన్ని కొనసాగిస్తుంది? అనే ఆసక్తి అందరిలో కలుగుతోంది. ఎందుకంటే.. ఆ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఉండటం, గత టీబీఎం విధానంలో ఇన్‌లెట్ అండ్ ఔట్‌లెట్ మాత్రమే ఉండి ఆడిట్‌లు లేకపోవడంతో డీబీఎం పద్ధతిలో చేస్తే కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
అవేంటంటే..
సాధారణంగా మైన్స్‌లో పేలుళ్లు జరిపినప్పుడు కనీసం 500 మీటర్ల వరకూ బ్లాస్టింగ్ వేవ్స్ ప్రసారం అవుతాయి. ఇది ఉపరితలంపై ఉన్న పర్యావరణానికి, జంతుజాలానికి ఇబ్బందులు కలిగించవచ్చు. అందునా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాంతం పూర్తిగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న నేపథ్యంలో.. ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు లేకుండా టన్నెల్ పూర్తికి న్యూ ఆస్ట్రెయిన్ టన్నెలింగ్ మెథడ్ (ఎన్‌ఏటీఎం)ను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో మకింగ్ తరలించడానికి ప్రస్తుతం ఉన్న కన్వేయర్ బెల్టు విధానాన్నే ఉపయోగిస్తారా? లేక ఒకటి రెండు చోట్ల ఆడిట్‌లు ఏర్పాటు చేస్తారా? అనే విషయంలో స్పష్టత రాలేదు. ఎన్‌ఏటీఎం పద్ధతిలో రెండు విధాలుగా మకింగ్ తరలించడానికి అవకాశం ఉంది. టన్నెల్ ప్రాంతంలో బ్లాస్టింగ్ పాత పద్ధతిలో కాకుండా కేవలం 4 మీటర్ల డయాలో వేవ్స్ వచ్చేలా బ్లాస్టింగ్ చేయడం ఒక పద్ధతి. ప్రస్తుతం ఉన్న టన్నెల్ చుట్టుకొలత 9.2 మీటర్లు కాగా.. డీబీఎం పద్ధతిలో గుర్రం డెక్క ఆకారంలో 10 మీటర్ల డయాలో చేపట్టనున్నారు. దీంతో.. అక్కడ బ్లాస్టింగ్ చేయడం వల్ల 400 మీటర్ల నుంచి 500 మీటర్ల పైన ఉన్న అటవీప్రాంతానికి, జంతుజాలానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు అంటున్నారు. బ్లాస్టింగ్ తర్వాత మకింగ్ మొత్తం తీసివేసి వెంటనే స్టీల్ జాలీలను అమర్చి షార్ట్‌క్రీట్ వేసి, రాక్‌బోల్టులను అమర్చుతారు. బ్లాస్టింగ్‌కు సంబంధించి.. ఏప్రిల్‌లోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్‌తో కమిటీ ఏర్పాటు చేసి ప్రణాళికలు తీసుకుంటున్నారు. అలాగే.. టన్నెల్ వెళ్తున్న మార్గంలో షీర్ జోన్లు, జలవనరులు ఉన్నట్లు సర్వేలో తేలితే.. తవ్వకం సమయంలో అలాంటి సున్నిత ప్రదేశాలు వచ్చినప్పుడు అలైన్‌మెంట్‌ను క్రాస్ సెక్షన్ చేసుకొని టన్నెల్ పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
సర్వే నివేదిక ముఖ్యం..
టన్నెల్ తవ్వకాన్ని పునఃప్రారంభించాలంటే ప్రస్తుతం చేపట్టిన హెలీబార్న్ ఎలకో్ట్ర మ్యాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వే నివేదిక చాలా ముఖ్యం. సర్వే సోమవారం ప్రారంభం కాగా వారంలో పూర్తి చేసి.. ఆ తర్వాత 15 రోజుల్లో 3డీ మ్యాపింగ్ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు సమాచారం.
3డీ మ్యాప్ రూపంలో సర్వే నివేదిక
ప్రస్తుతం చేస్తున్న హెలీబార్న్ ఎలకో్ట్ర మ్యాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వేను వారంలో పూర్తిచేసి.. ఆ తర్వాత 15 రోజుల్లోగా నివేదికను పూర్తిగా 3డీ మ్యాప్ రూపంలో అందజేస్తాం. భూమి లోపల 500 మీటర్ల వరకూ మినరల్స్, షీర్ జోన్స్, వాటర్ బాడీస్ ఏమున్నాయి అనే విషయం ఈ సర్వేలో వెల్లడవుతుంది.
- డాక్టర్ సత్యనారాయణ, చీఫ్ సైంటిస్ట్,
ఎన్‌జీఆర్‌ఐ