Share News

BJP Telangana President Ramachandra Raju: పాకిస్తాన్‌పై ఎందుకంత ప్రేమ?

ABN , Publish Date - Dec 16 , 2025 | 04:28 AM

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌పై ఎందుకంత ప్రేమ..? చొరబాటుదారుల ఓట్లు తొలగిస్తే మీకెందుకు ఇబ్బంది’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు....

BJP Telangana President Ramachandra Raju: పాకిస్తాన్‌పై ఎందుకంత ప్రేమ?

  • వారి ఓట్లు తొలగిస్తే మీకెందుకు ఇబ్బంది: రాంచందర్‌రావు

  • రాహుల్‌, ఖర్గే క్షమాపణలు చెప్పాలి: కేంద్ర మంత్రి సంజయ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌పై ఎందుకంత ప్రేమ..? చొరబాటుదారుల ఓట్లు తొలగిస్తే మీకెందుకు ఇబ్బంది’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు.. కాంగ్రె్‌సను నిలదీశారు. భారతీయులు కానివారికి ఓటు హక్కు ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని అన్నారు. సర్దార్‌ పటేల్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నాయకులు నివాళులర్పించారు. అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ఓటరు జాబితాలో పేరు తొలగిస్తే ఆధార్‌ కార్డు కూడా రద్దు చేస్తారంటూ సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఢిల్లీలో ర్యాలీ సందర్భంగా ప్రధాని మోదీని కాంగ్రెస్‌ నాయకులు బెదిరించే రీతిలో నినాదాలు చేశారని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ‘కబర్‌’ అనే పదంతో కాంగ్రెస్‌ నేతలు ఉద్దేశపూర్వకంగా నినాదాలు చేశారని రాంచందర్‌రావు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు బీజేపీ బలపరిచిన 600 మంది సర్పంచులుగా, 45వేల మంది వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారని రాంచందర్‌రావు తెలిపారు. కాగా, నిర్మల్‌ నియోజకవర్గంలో 128 పంచాయతీలకు గాను 80 పంచాయతీల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో వార్డు సభ్యులు గెలిచారని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు వారిని అభినందించారు.


మోదీపై బెదిరింపు వ్యాఖ్యలు సరికాదు..

ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీపై బెదిరింపు ధోరణిలో నినాదాలు చేసినందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. మోదీపై చేసిన నినాదాలను తీవ్రంగా ఖండించారు. దేశ భద్రత, అభివృద్ధి, గౌరవం కోసం మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతుంటే కాంగ్రెస్‌ నాయకులు బెదిరింపులతో దుర్భాషలాడారని మండిపడ్డారు. ర్యాలీ సందర్భంగా చేసిన ‘మోదీ తేరీ కబర్‌ ఖుదేగీ’ వంటి నినాదాలు అల్లరి మూకల భాషకు నిదర్శనమని.. ముసుగు తొలగినప్పుడు కాంగ్రెస్‌ అసలు రూపం కూడా అదే అని సంజయ్‌ ఎక్స్‌లో స్పష్టం చేశారు.

Updated Date - Dec 16 , 2025 | 04:28 AM