BJP Telangana president Ramchander Rao: స్థానిక ఎన్నికలతో బీజేపీ అధికారానికి పునాది
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:45 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు గ్రామాల్లోని అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు....
అన్ని గ్రామాల్లో బరిలోకి పార్టీ అభ్యర్థులు
అత్యధిక స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు గ్రామాల్లోని అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఆయా అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికారం చేపట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలు పునాది కావాలంటూ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ఇతర ముఖ్య నాయకులతో రాంచందర్ రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు ప్రతీ గ్రామంలో బీజేపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఈ సందర్భంగా అన్నారు. పార్టీ శ్రేణులు అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు అందించి, అత్యధిక స్థానాలు గెలిపించాలని సూచించారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నీ నిర్వీర్యం అయ్యాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండేళ్లుగా పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్థికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోందని, రోడ్లు, పీఎం కిసాన్, మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధి హామీ పథకం, వీధి దీపాలు, స్మశానాల అభివృద్థి వంటి పనులు ఆ నిధులతోనే నిర్వహిస్తారని వివరించారు. ఈ విషయాలను గ్రామాల్లోని ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు రాంచందర్‌రావు సూచించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు.
రాజ్యాంగ రక్షణే బీజేపీ లక్ష్యం
బర్కత్‌పుర: భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. డాక్టర్ అంబేడ్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాణం జరగగా అందులో ఆరుగురు తెలుగువారు ముఖ్యపాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు ఉల్లంఘించిందని, రాజ్యాంగం కోసం ఏమీ తెలియకపోయినా రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో భాగంగా ‘మనం మన భారత రాజ్యాంగం’ అనే పుస్తకాన్ని రాంచందర్‌రావు ఆవిష్కరించారు.