BJP Supports BC Community Bandh: బీసీల బంద్‌కు బీజేపీ మద్దతు
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:25 AM
బీసీల హక్కుల కోసం బీసీ సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చిన బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..
మా పార్టీతోనే బీసీలకు న్యాయం: రాంచందర్ రావు
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): బీసీల హక్కుల కోసం బీసీ సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చిన బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. బుధవారం బీజేపీ ఎంపీ, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో బీసీ జేఏసీ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావును కలిశారు. ఈ నెల 18 తేదీన బీసీల బంద్‌కు మద్దతునివ్వాలని కోరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీసీలకు తమ పార్టీ అండగా నిలుస్తోందని చెప్పారు.
బీజేపీ, బీసీ నేతల మధ్య డిష్యూం డిష్యూం
ఆర్. కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును కలిసిన సందర్భంగా ఫొటోలు దిగేందుకు నాయకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, బీసీ సంఘాల నేతలకు మధ్య మాటా మాటా పెరిగింది. వాగ్వాదం తీవ్ర రూపందాల్చి ఘర్షణకు దారితీసింది. కృష్ణయ్య, రామచందర్ రావు వారించినా ఘర్షణకు దిగిన నాయకులు వెనక్కి తగ్గకపోవడంతో వాతావరణం ఉద్రిక్తతకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.