BJP faced a severe blow: బీజేపీకి భారీ షాక్
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:09 AM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల కంటే తక్కువ ఓట్లు సాధించడం, డిపాజిట్ కూడా కోల్పోవడంతో ప్రత్యర్థికి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందన్న విమర్శను మూటగట్టుకుంది...
జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ గల్లంతు.. గత ఎన్నిక కంటే ఈసారి తక్కువ ఓట్లు
హైదరాబాద్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల కంటే తక్కువ ఓట్లు సాధించడం, డిపాజిట్ కూడా కోల్పోవడంతో ప్రత్యర్థికి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందన్న విమర్శను మూటగట్టుకుంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల కంటే 8వేలకుపైగా ఓట్లు ఈసారి తక్కువగా రావడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో బీజేపీకి 25,866 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 64,673 ఓట్లు వచ్చాయి. తాజా ఉపఎన్నికలో 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి 34వేల సభ్యత్వం ఉంది. కానీ, అందులో సగం ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. ‘గౌరవప్రదమైన ఓట్లు కూడా సాధించలేకపోవడం మమ్మల్ని విస్మయానికి గురి చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నాయకులు చెమటోడ్చినా ప్రత్యర్థులకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాం’ అంటూ బీజేపీ సీనియర్ నేత ఒకరు వాపోయారు. ‘జుబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక ఖాయమని తేలినప్పటి నుంచే మేం స్థానికంగా బలోపేతం కావాల్సింది. మా ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి తిప్పికొట్టడంలో విఫలమయ్యాం’ అని మరో సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ‘హిందూత్వ నినాదంతో బండి సంజయ్‌ని చివరి నిమిషంలో రంగంలోకి దింపారు. ఆయన్ను ముందుగా రంగంలోకి దింపితే ఫలితం ఇంత దారుణంగా ఉండేది కాదు’ అని మరికొందరు అంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిదే భారం అన్నట్లుగా కొంతమంది సీనియర్ నేతలు వ్యవహరించడమూ భారీ ఓటమికి కారణమని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
బన్సల్ అందుకే దూరంగా ఉండిపోయారా ?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బీజేపీ జాతీయ నాయకత్వం సీరియ్‌సగా తీసుకుందా?లేదా? అన్న అంశంపై స్పష్టత లేకున్నా, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ మాత్రం ఇక్కడి పార్టీ ప్రచార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాష్ట్ర పర్యటనకు వచ్చిన బన్సల్.. ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అప్పుడు సమన్వయలోపం విస్పష్టంగా కనిపించింది. బహుశా అందుకేనేమో ఆయన మళ్లీ రాలేదు’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.