Share News

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ నాటకాలు

ABN , Publish Date - Oct 06 , 2025 | 04:03 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు స్థానిక సంస్థలకు చేసిన అన్యాయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది...

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ నాటకాలు

  • స్థానిక సంస్థలకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చేసిన అన్యాయాలపై విస్తృత ప్రచారం చేయాలి

  • బీజేపీ పదాధికారుల భేటీలో నిర్ణయం.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు జిల్లాల బాధ్యతలు

  • మనది టీం బీజేపీ: అధ్యక్షుడు రాంచందర్‌రావు.. కలిసికట్టుగా పనిచేద్దాం: కిషన్‌రెడ్డి

  • ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

  • రెండు జిల్లాల అధ్యక్షుల పని తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అసహనం

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు స్థానిక సంస్థలకు చేసిన అన్యాయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నాటకాలాడుతోందని మండిపడింది. బీఆర్‌ఎస్‌ హయాంలో పంచాయతీలను నిర్వీర్యం చేసిన అంశాలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని తీర్మానించింది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలుకు పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు జిల్లాల బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రచార వ్యూహం అమలు చేయాలని.. అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. కలిసికట్టుగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. ‘మనది టీం బీజేపీ. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జుబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కూడా సత్తా చాటుదాం. ప్రత్యర్థుల ఎత్తులను తిప్పికొడదాం’ అని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. జుబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలిచితీరదామన్నారు. అందరినీ కలుపుకొని వెళదామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రతి వార్డు ఎన్నికనూ కీలకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు గతంలో పనిచేసిన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులను కూడా భాగస్వాములను చేయాలని చెప్పారు. వారిని కూడా జడ్పీటీసీ ఇన్‌చార్జులుగా, జిల్లా ఇన్‌చార్జులుగా నియమించాలని కిషన్‌రెడ్డి సూచించారు. ఈ నెల 8న మరోసారి విస్తృత సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతంరావు తెలిపారు. సమష్టిగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. మోదీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామీణ ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మోసపూరిత హామీలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించాలని బీజేఎల్పీ ఉప నేత పాయల్‌ శంకర్‌ అన్నారు.


ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం: వెంకటరమణారెడ్డి

పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఏర్పడిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన సమావేశంలో ప్రశ్నించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నట్లు సమాచారం. ‘సమావేశాలకు రావడం, వెళ్లడం.. ఇదేనా మా పని? క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఎక్కడ?’ అని అని వెంకటరమణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు నిర్దేశించినా, క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదని పేర్కొన్నట్లు సమాచారం. తన నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లా పార్టీ అధ్యక్షుల తీరు పట్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీలో సమన్వయం ఉండాల్సింది పోయి, కనీస సమాచారం కూడా లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే ఎలా? అని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Updated Date - Oct 06 , 2025 | 04:03 AM