BJP State President Ramchander Rao: మీ నేతలే మీ కుర్చీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారు
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:24 AM
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీ పార్టీ నేతలే మీ కుర్చీని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు...
ముందు ఆ సంగతి చూసుకోండి
సీఎం రేవంత్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చురకలు
కాంగ్రెస్సే మతతత్వ పార్టీ అని ధ్వజం
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీ పార్టీ నేతలే మీ కుర్చీని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు ఆ సంగతి చూసుకోండి’ అని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు చురకలేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోభియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం కోసం ‘జూబ్లీహిల్స్‌లో బీజేపీ విజయ జ్యోతి’ అనే పేరుతో ఆదివారం వెంగళరావు నగర్‌లో రాంచందర్‌రావు పాద యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసే మోసగిస్తున్నాయని, కులం, మతం పేరిట ఆ రెండు పార్టీలు చేస్తున్న కుట్ర రాజకీయాలను నమ్మొద్దన్నారు. బీజేపీని మతోన్మాద పార్టీ అని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. క్రిస్టియన్లంతా కాంగ్రె్‌సకు ఓటేయాలని డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్సే ముస్లింలు.. ముస్లింలే కాంగ్రెస్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం మతం ఆధార ప్రచారం కాదా? అని నిలదీశారు. ‘మజ్లిస్ పార్టీయే కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీయే మజ్లిస్’ అని దుయ్య బట్టిన రాంచందర్‌రావు.. ‘అబద్ధాలకు తల్లి వంటిది కాంగ్రెస్. అలాంటి పార్టీలో అబద్ధాల కోరు రేవంత్’ అని మండి పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్‌ఎస్ దోచుకుంటే.. మూసీ ప్రాజెక్టు పేరిట మీరు దోచుకోవాలని చూస్తున్నారా? అని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై మండి పడ్డారు. అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేసిన రాంచందర్‌రావు.. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ చేసింది శూన్యమని, కేంద్రమేమీ ఇవ్వకుండానే తెలంగాణ అభివృద్ధి చెందిందా? అని ప్రశ్నించారు. ‘డొక్కు బస్సులిచ్చి మహిళలకు ఉచిత ప్రయాణమని డబ్బా కొట్టుకుంటున్నారు. ఆ బస్సులు ప్రమాదాలకు గురై ప్రయాణికులు చనిపోతున్నారు. మీ పాలన అటువంటిది’ అని విమర్శించారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎప్పుడే భవనం కూల్చేస్తారోనని జనం భయపడుతున్నారు. హైడ్రా పేరిట ఎంత మంది పేదల ఇళ్లు కూల్చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి’ అని డిమాండ్ చేశారు. మల్కం చెరువులోని అక్రమ భవనాన్ని ఎందుకు వదిలి పెట్టారని నిలదీసిన రాంచందర్‌రావు..ఎంఎంటీఎ్‌సకు రాష్ట్రం వాటా నిధులెందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ విజయం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.