BJP State Committee Formation: కమలదళంలో కమిటీ చిచ్చు!
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:14 AM
కమలదళంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చిచ్చు రాజేసింది. కమిటీలో ప్రాంతీయ సమతుల్యం లోపించిందని కొందరు ఎంపీలు...
మా మాటకు విలువ లేకుండాపోయింది.. కొత్త కమిటీ కూర్పుపై ఎంపీలు, ఎమ్మెల్యేల అసంతృప్తి
అంత పనికిరాకుండాపోయామా? సనియర్ నాయకుల ఆగ్రహం
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కమలదళంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చిచ్చు రాజేసింది. కమిటీలో ప్రాంతీయ సమతుల్యం లోపించిందని కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ మాటను పట్టించుకోలేదంటూ ఈ కమిటీ కూర్పుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ గల పార్టీ అయినందున తాము బహిరంగంగా తమ అభిప్రాయాలు వెల్లడించలేకపోతున్నట్లు చెప్పారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ వైఖరి పట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు మండిపడుతుండటం పార్టీవర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘ఇది పార్టీ ఆధారిత కమిటీ కాదు.. నాయకుల ఆధారిత కమిటీ. పార్టీ రాష్ట్ర చరిత్రలో ఇంత వ్యతిరేకత ఎన్నడూ కనిపించలేదు’ అని బీజేపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. ‘బీజేపీ అంటే నగరాలకు మాత్రమే పరిమితమైన పార్టీ అనే అపప్రద ఇప్పటికే ఉంది.. ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాలకు చేరువవుతున్న తరుణంలో పార్టీ కమిటీలో 70శాతం పదవులు నగరవాసులకు, అందునా హైదరాబాద్‌లో స్థిరపడ్డవారికే ఇవ్వడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో ఆలోచన చేయకపోవడం విచారకరం. ఇప్పుడు మాకు న్యాయం జరగలేదు. ఇక ఏదో ఒక సెల్ (పార్టీ విభాగం) ఇస్తరు. మాకు అవి కూడావొద్దు. సాధారణ కార్యకర్తలుగానే ఉండిపోతాం’ అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికలతో పాటు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మా శ్రమంతా ధారపోశాం. అభ్యర్థులు సహకరించకున్నా పార్టీ కోసం కష్టపడ్డాం.. రెండు సీట్లూ గెలుచుకున్నాం. కనీసం ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకోనైనా మా ప్రాంతానికి కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాల్సింది’ అని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వాపోయారు. ‘ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న మాలాంటి వాళ్లకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వరు.. కొత్తగా వచ్చినోళ్లకే ఇచ్చి మమ్మల్ని పనిచేయాలని అంటారు. అయినా, క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పనిచేస్తూ వస్తున్నాం. ఇప్పుడు పార్టీకోసం కమిటీలో కూడా పనిచేయడానికి పనికిరానోళ్లమయ్యామా? జిల్లా ఇన్‌చార్జి అంటూ మాతో గొడ్డుచాకిరి చేయిస్తూ పదవులేమో ఇతరులకు ఇస్తారా? కమిటీలో అవకాశం కల్పించేందుకు నాయకులే కరువయ్యారా?’
అని సదరు నేత పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌పై మండిపడ్డారు. ‘పార్టీ కోసం లాఠీదెబ్బలు తిన్నవాళ్లు.. ప్రాణాలకు తెగించి కొట్లాడినవాళ్లున్నరు.. అలాంటివారిని కాదని కేవలం ఆఫీసుకే పరిమితమయ్యేవారికి కమిటీలో చోటు కల్పించడం దురదృష్టకరం’ అని ఉమ్మడి వరంగల్ జిల్లా నేత ఒకరు వాపోయారు. కాగా, గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించిన ఓ నేతకు రాష్ట్ర కమిటీలో అవకాశం ఇవ్వొద్దని ఒక ఎంపీ పట్టుబట్టారు. అయితే, తన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో సదరు ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన పార్లమెంటు నియోజకవర్గంలో తాను సూచించిన వ్యక్తికి కాకుండా ఇంకొకరికి కమిటీలో చోటు కల్పించడం పట్ల మరో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీవర్గాలు పేర్కొన్నాయి.
డైనమిక్ టీమ్ ఇది: రాంచందర్‌రావు
బీజేపీ కొత్త రాష్ట్ర కమిటీ డైనమిక్ టీమ్ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. యువతను ప్రోత్సహించామని, పారీకి కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలకు దాదాపుగా ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. ‘కమిటీ కూర్పులో సామాజిక సమతుల్యం పాటించాం. అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చాం. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలతో కలిపితే 35 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.. అందువల్ల ఇక్కడ కొంత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సివచ్చింది. కొత్తవారికి అవకాశం ఇచ్చాం.. సీనియర్లకు, పాతవారికి మరో బాధ్యత ఇస్తాం. కమిటీలో చోటు దక్కనంత మాత్రాన వారిని గుర్తించనట్లు కాదు. ఏ నాయకుడూ బాధ పడొద్దు.. వారి సేవలను ఏదోవిధంగా వినియోగించుకుంటాం’ అని రాంచందర్‌రావు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.