BJP Telangana president N. Ranchandra Rao: బీఆర్‌ఎస్‌ను రాష్ట్ర ప్రజలు మరిచిపోయారు
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:33 AM
రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తు లేదని, ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు మరచిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పేర్కొన్నారు...
తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు
రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు
కేసీఆర్ బయటకు రావడం అలాంటిదే..
కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయం మా పార్టీయే
బీజేపీ కార్యకర్తలను వేధించడానికే ‘విద్వేషపూరిత ప్రసంగ’ బిల్లు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తు లేదని, ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు మరచిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణాలో వన్ టైం పాలిటిక్స్(ఓటీపీ) చెల్లబోవని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. ‘నెలల తరబడి ఫాంహౌజ్‌లో ఉండిపోయిన కేసీఆర్ ఇప్పుడు బయటకు రావడం ఓటీపీ లాంటిదే. ఆయన మళ్లీ ఫాంహౌజ్‌కు వెళ్లిపోతారు.. మళ్లీ వస్తారు.. మళ్లీ ఫాంహౌజ్‌కి వెళతారు.’ అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును, అవినీతిని, ప్యూడలిజాన్ని రాష్ట్ర ప్రజలు చూశారని రాంచందర్‌రావు పేర్కొన్నారు. ‘హేట్ స్పీచ్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి చట్టాన్నే కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ నాయకులను, కార్యకర్తలను వేధించడానికే హేట్ స్పీచ్ బిల్లు’ అని రాంచందర్‌రావు మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని విమర్శించేవారిని కాపాడ్డానికి, హిందూత్వ గురించి మాట్లాడేవారిని వేధించడానికే ఈ బిల్లు అని ఆయన ఆరోపించారు. ‘హిందూ దేవతల పట్ల హేళనగా మాట్లాడింది కాంగ్రెస్ కాదా? ముస్లింలే కాంగ్రెస్.. కాంగ్రెస్సే ముస్లింలు.. అని అన్నది మీరు కాదా?’ అని కాంగ్రె్‌సను రాంచందర్‌రావు నిలదీశారు. సనాతన ధర్మంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందే కాంగ్రెస్ అని ఆయన ఆరోపించారు.