BJP protest: వంచక పాలనపై యుద్ధం
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:13 AM
కాంగ్రెస్ వంచక పాలన సాగిస్తోందని, దానిపై మహా ధర్మయుద్ధం చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. కాంట్రాక్టులు, కమీషన్లకే పరిమితమైన కాంగ్రె్‌సను గద్దె దించేవరకూ.....
కమీషన్ల కాంగ్రె్‌సను గద్దె దించే వరకు విశ్రమించం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హామీలపై ప్రజలు కాంగ్రె్‌సను నిలదీయాలి: కిషన్ రెడ్డి
ధర్నాచౌక్‌లో బీజేపీ మహాధర్నా
హైదరాబాద్/కవాడిగూడ, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ‘వంచక పాలన’ సాగిస్తోందని, దానిపై మహా ధర్మయుద్ధం చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. కాంట్రాక్టులు, కమీషన్లకే పరిమితమైన కాంగ్రె్‌సను గద్దె దించేవరకూ విశ్రమించబోమని చెప్పారు. ‘ బీఆర్‌ఎస్ హయాంలో సీఎం అండ్ సన్స్ పాలన ఉండగా, ఇప్పుడు సీఎం అండ్ బ్రదర్స్ పాలన వచ్చింది. వాళ్ల ఖజానా నిండుతోంది తప్ప సామాన్యుడికి మిగిలేది శూన్యమే’నని విమర్శించారు. ‘గల్లంతైన గ్యారంటీలు.. నెరవేరని వాగ్దానాలు.. ప్రజా వంచనకు రెండేళ్లు’ నినాదంతో ఆదివారం ధర్నాచౌక్‌లో బీజేపీ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రాంచందర్‌రావు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి కాంగ్రెస్ పాలనపై ఛార్జిషీట్ విడుదల చేశారు. కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందని, హిందూ దేవుళ్లను అవమానిస్తోందని ఆయన మండిపడ్డారు. హిందువులకు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని, కాంగ్రెస్ నాయకులకు మాత్రం ముగ్గురే దేవుళ్లని (సోనియా, రాహుల్, ప్రియాంక) ఎద్దేవా చేశారు. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచింది కాంగ్రెస్ కాదు.. మజ్లిస్ పార్టీ! అందుకే ‘రేవంతుద్దీన్’ (సీఎం రేవంత్), హిందూ దేవుళ్లను అవమానిస్తున్నార’ని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ద్రోహులను, అర్బన్ నక్సలైట్లను పెంచిపోషిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అర్బన్ నక్సలైట్లను అంతం చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందంటూ కాంగ్రెస్ నాయకులు పదే పదే విమర్శించడంపై మండిపడ్డారు. ‘గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే రాష్ట్ర ప్రజలు వారిని ఇంటికి పంపించారు. ఇప్పుడు మీకూ అదే గతి పడుతుంద’ని స్పష్టం చేశారు. ‘మీ కుర్చీ కూడా తొందర్లోనే కదిలేట్టు ఉంది.. మీ మంత్రులే కుర్చీ కాళ్లను లాగుతున్నారు. ఏదో ఒక రోజు అది విరిగి మీరు కిందపడిపోతారు జాగ్రత్త’ అని రాంచందర్‌రావు సీఎం రేవంత్‌కు పరోక్ష హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని దుస్థితి నెలకొందని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగినట్లే మద్యం, భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి కాంగ్రెస్ పాలనలో కూడా కొనసాగుతోందని విమర్శించారు. అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని మ్యానిఫెస్టోలో చేసిన ప్రకటన ఏమైందని కాంగ్రె్‌సను ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో గ్లోబల్ సమ్మిట్ అనే కొత్త నాటకం మొదలుపెట్టిందని ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు. నిజం ఏమిటంటే.. తెలంగాణ ‘రైజింగ్ ఇన్ కరప్షన్, గన్ కల్చర్’ అని వ్యాఖ్యానించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు రేవంత్ రెడ్డి పైసా అయినా ఇచ్చారా అని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు విజయోత్సవాలు జరుపుకునే అర్హత లేదన్నారు. హిల్ట్ భూములపై అవినీతిని రుజువు చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయసన్యాసం చేస్తానని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి వెనక చెడ్డీ గ్యాంగ్ ఉందని, ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఆ గ్యాంగ్ వాలిపోతుందన్నారు. రేవంత్ రెడ్డి ‘రాబంద్ రెడ్డి’గా మారిపోయారన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కంపెనీ మూతపడుతుందని, తెలంగాణలో ఐకమత్యమే బీజేపీకి అధికారం తెస్తుందని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్‌రావు అన్నారు. తన ప్రోటోకాల్ ఏంటో తనకే తెలియదంటూ పార్టీ తీరుపై పార్టీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కొంచెం ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విద్యార్థినులకు స్కూటీ, మహిళలకు ప్రతి నెలా రూ.2,500, కల్యాణ లక్ష్మిలో రూ.లక్షతో పాటు తులం బంగా రం ఇస్తామన్న హామీలను అమలు చేయాలంటూ బీజేపీ నాయకులు ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో చెట్టుకు స్కూటీ, డమ్మీ నోట్లు, బంగారం నాణాల నమూనాలను చెట్టుకు వేలాడదీసి నిరసన వ్యక్తం చేశారు.
గ్లోబల్ సమ్మిట్‌ను స్వాగతిస్తున్నాం
వికసిత్ భారత్-2047 లక్ష్యంగా ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌ను స్వాగతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి హాజరవుతారన్నారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని, తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే: కిషన్ రెడ్డి
రామగిరి: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో నాడు కేసీఆర్ పద్ధతినే నేడు కాంగ్రెస్ కూడా అవలంబిస్తోందని విమర్శించారు. సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.43 ఖర్చు భరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.15మాత్రమే భరిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కూడా ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు ఇస్తోందని చెప్పారు. పథకాలను కాకుండా భూ దందాలు, లిక్కర్ మాఫియాను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతమైందన్నారు.